AP BJP Alliance: కూటమిలో బీజేపీ ఒంటరైందా?
ఎన్నికల వేళ AP BJP Alliance ప్రాధాన్యతపై కొత్త చర్చ. జడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్ పీఠాల పంపకాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ వాటాల పూర్తి కథనం.

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీయే కూటమిలో లుకలుకలు.
AP BJP Alliance: కూటమిలో బీజేపీకి ప్రాధాన్యం తగ్గిందా..? స్థానిక ఎన్నికలతో అది తేటతెల్లమైందా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీలు మూడైన.. తామంతా ఒకటే అని చెబుతున్నా.. అప్పుడప్పుడు లొసుగులు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా జడ్పీ అభ్యర్థుల ఎంపికలో బీజేపీకి అన్యాయం జరిగిందనే వాదన కమలనాథులే వెళ్లగక్కుతున్న పరిస్థితి? మరి కమలనాథులు భావిస్తున్నట్లుగానే కూటమిలో కమలం పార్టీకి విలువ లేదా? కేంద్రంలో అధికారంలో.. ఉన్న రాష్ట్రంలో మాత్రం ఒంటరైందా? అసలు కూటమిలో బీజేపీ స్థానమేంటి?
AP BJP Alliance: స్థానిక ఎన్నికలతో బయటపడ్డ లుకలుకలు?
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పొత్తుగా ఏర్పడి కలిసి పోటీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ.. మూడు పార్టీల మధ్య సమన్వయము తగ్గిందని, పైకి అంతా కలిసి మెలిసి కనిపిస్తున్న.. లోలోపల మాత్రం ఎవరికీ వారే యమునాతీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే గుసగుసలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తాజా లోకల్ బాడీ ఎలక్షన్స్ తో ఆ లుకలుకలు స్పష్టంగా బయట పడ్డాయి. ముఖ్యంగా సీట్ల సర్దుబాటులోను అభ్యర్థుల ఎంపికలోను ఎన్నో తర్జనభర్జనల నడుమ తుది నిర్ణయానికి వచ్చాయి మూడు పార్టీలు. అయితే సీట్ల కేటాయింపులో సింహభాగం టీడీపీకే దక్కిన.. జనసేన కూడా ఎంతో కొంత సమన్యాయంతోనే సాగింది. కానీ ఎటొచ్చి బీజేపీకె అన్యాయం జరిగిందనేది కాషాయ పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోనే కూటమి ధర్మం పేరుతో బీజేపీని కేవలం నామమాత్రపు భాగస్వామిగా మార్చేశారని, ఎంపీపీ, జడ్పీ పీఠాల పంపకాల్లో కమలం పార్టీకి మొండిచేయి ఎదురైందని.. ఆ పార్టీ నేతలు అంతర్మథనానికి లోనౌతున్నారట. నిజంగానే బీజేపీ (AP BJP Alliance) కి అన్యాయం జరుగుతోందా అనే దానిపై వాస్తవాలను పరిశీలిస్తే.. నాటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో టీడీపీ, జనసేనలు మొదట చేతులు కలిపాయి. ఆ తర్వాత, కేంద్రంలో ఉన్న బీజేపీ మద్దతు తోడైతేనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమవుతుందని భావించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపి ఎన్డీయే కూటమిలో భాగమయ్యారు. అప్పుడు కుదిరిన సీట్ల సర్దుబాటులో మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాలతో సర్దుకున్నాయి. అలాగే 25 లోక్ సభ స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాలతో బరిలోకి దిగాయి.
2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. పెరిగిన కమలం ఆశలు
ఆ సమయంలో బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు కేటాయించినప్పుడు కూడా రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. తమ పార్టీ జాతీయ పార్టీ అని, తమకు కనీసం 20 నుండి 25 అసెంబ్లీ స్థానాలు కావాలని రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దల ముందు వాదించారు. కానీ ఏపీలో పార్టీ బలహీనంగా ఉండడం, సరైన అభ్యర్థులు లేకపోవడం వంటి లోపాలతో ఢిల్లీ అధిష్టానం కూడా ఆ టైంలో సైలెంట్ కావాల్సివచ్చింది. పైగా స్థానిక ఎన్నికల్లోనూ, నామినేటెడ్ పదవుల్లోనూ సముచిత న్యాయం కల్పిస్తామని టీడీపీ నుంచి స్పష్టమైన భరోసా రావడంతో కమలనాథులు కొంత సద్దుమణిగారు. ఇక ఎన్నికల్లో ఎవ్వరు ఊహించని విధంగా 175 అసెంబ్లీ స్థానాల్లో 164 స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. బీజేపీ పోటీ చేసిన 10 అసెంబ్లీ స్థానాల్లో 8 చోట్ల గెలుపొందింది. అలాగే 6 లోక్‌సభ స్థానాలకు 3 చోట్ల ఘనవిజయం సాధించింది. ఇది నిజంగా కాషాయ పెద్దలు కూడా ఊహించని ఫలితాలే. దీంతో బీజేపీ గ్రాఫ్ పెరిగిందని, ఇక ఏపీలో కూడా పాగా వేయొచ్చని ఆ పార్టీ పెద్దలు భావించారు. కానీ అసలు పరీక్ష ఆ తరువాతే మొదలైంది.. రాజకీయ పార్టీల్లో ఉండే ఉత్సాహం, క్యాడర్ బలం స్థానిక ఎన్నికలతోనే బయటపడుతుంది.
కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జడ్పీ పీఠాల్లో AP BJP Alliance వాటా ఎంత?
వార్డు మెంబర్ నుంచి, కార్పొరేటర్ వరకు క్షేత్రస్థాయిలో ఉండే ఈ పదవులే నాయకుల రాజకీయ భవిష్యత్ ను డిసైడ్ చేస్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికల ఫార్ములానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అమలు చేయాలని కూటమి పెద్దలు సూత్రప్రాయంగా అంగీకరించారు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. రాష్ట్రంలోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీ 11 చోట్ల మేయర్ పీఠాలను దక్కించుకుంటే.. జనసేనకు 4 కార్పొరేషన్లు సొంతం చేసుకుంది. మరి జాతీయ పార్టీ అయిన బీజేపీకి దక్కింది మాత్రం కేవలం 2 మాత్రమే. కార్పొరేషన్లోనే కాదు మునిసిపాలిటీల్లో కూడా మొత్తం స్థానాల్లో టీడీపీ ఏకంగా 78 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. జనసేన 21 చోట్ల ఛైర్మన్ పదవులను దక్కించుకుంది. కానీ బీజేపీకి కేటాయించింది మాత్రం కేవలం 7 మున్సిపాలిటీలే. ఇక పరిషత్ ఎన్నికలను గమనించినా కాషాయ పార్టీకి ఒరిగిందేమి లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 28 జడ్పీ పీఠాలకు గాను ప్రతిపక్ష వైసీపీ ఒక స్థానాన్ని ఎగరేసుకుపోగా.. మిగిలిన 27 జడ్పీ పీఠాల్లో టీడీపీ 22 పీఠాలను, జనసేనకు 4 పీఠాలను సొంతం చేసుకున్నాయి. కానీ బీజేపీకి దక్కింది మాత్రం కేవలం ఒక్కే ఒక్క స్థానమే. ఇక ఎంపీపీ పీఠాల్లో కూడా కూటమి 93 శాతం కైవసం చేసుకుంది.. అందులో బీజేపీ వాటా ఎంత అని చూస్తే.. భూతద్దం పెట్టి వెతకాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కమలం నేతలు వాపోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాలోని కొన్ని మండలాల్లో బీజేపీకి దశాబ్దాలుగా బలమైన క్యాడర్ ఉంది. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా గెలిచిన చరిత్ర ఉంది. అలాంటి చోట్ల కూడా టీడీపీ, జనసేన నేతలు బీజేపీకి అన్యాయం చేశారనే చర్చ ఇంటర్నల్ గా జరుగుతోంది.
(మరిన్ని రాష్ట్ర స్థాయి రాజకీయ పరిణామాలు మరియు ఎన్నికల సమీకరణాల కోసం చూడండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు.)
Read also: Yelahanka Palace: షర్మిలపై జగన్ పిటిషన్.. యలహంకలోకి వేస్తే.. అంతే!
తక్కువ సీట్ల కేటాయింపు వెనుకున్న వ్యూహం?
కూటమిలో బీజేపీకి అన్యాయం జరుగుతోందని.. ఒక వర్గం కమలనాథులు భావిస్తుంటే.. బీజేపీకి తక్కువ సీట్లు కేటాయించడం వెనుక బలమైన కారణముందని మరో వర్గం చెబుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలనేవి సాధారణ ఎన్నికల లాంటివి కావు. ఇక్కడ పార్టీ గుర్తు కంటే అభ్యర్థి వ్యక్తిగత బలం, సామాజిక సమీకరణాలు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. బీజేపీకి చాలా మండలాల్లోను, మున్సిపాలిటీల్లోను బలమైన అభ్యర్థులు లేరు. బలహీనమైన అభ్యర్థులను నిలబెడితే ప్రత్యర్థి పార్టీ లాభపడుతుంది. అందుకే గెలుపు గుర్రాలకే సీటుగా కేటాయింపు జరిగిందనేది టీడీపీ, జనసేన వర్గాల వర్షన్. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత బలమైన గ్రామ స్థాయి క్యాడర్, బూత్ స్థాయి నెట్వర్క్ మరే పార్టీకి లేదు. దానికి తోడు, పవన్ కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఫాలోయింగ్, యువత మద్దతు అటు జనసేన పార్టీకి పెద్ద బలం. ఈ రెండు పార్టీలతో పోలిస్తే, ఏపీలో బీజేపీకి ఇంకా పూర్తిస్థాయిలో సంస్థాగత నిర్మాణం జరగలేదనేది వాస్తవం.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో సొంతంగా గెలవగలిగే సత్తా ఉన్న నాయకులు బీజేపీలో ఉన్నారా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. పోనీ స్థానిక ఎన్నికల్లో వార్డు స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అభ్యర్థులను నిలబెట్టడానికి బలమైన క్యాడర్ ఉందా? అంటే అది లేదు. ఈ లోపాల వల్లే బీజేపీకి ప్రతిబంధకంగా మారిందనేది రాజకీయ పండితులు చెబుతున్న మాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం స్థిరంగా కొనసాగాలన్నా, కీలక బిల్లులు ఆమోదం పొందాలన్నా ఎన్డీయే నేతృత్వంలోని 16 మంది టీడీపీ ఎంపీల మద్దతు బీజేపీ అధిష్టానానికి అత్యంత అవసరం. అలాంటి పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు మున్సిపల్ సీట్ల కోసమో, పది ఎంపీపీ పదవుల కోసమో పట్టుబట్టి చంద్రబాబుతో సంబంధాలు తెంచుకునేందుకు ఢిల్లీ పెద్దలు ఏమాత్రం సిద్ధంగా లేరు. పైగా సర్దుబాట్ల విషయంలో అన్యాయం జరిగినా.. కూటమి ఐక్యతకు భంగం కలిగించవద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ హైకమాండ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందట. అందుకే అటు అధిష్టానానికి చెప్పలేక.. ఇటు అన్యాయాన్ని సహించలేక అంతర్మథనానికి లోనౌతున్నారట రాష్ట్ర నేతలు. ఎన్నికల ఫలితాలు మరియు స్థానిక సంస్థల అధికారిక వివరాల కోసం సందర్శించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC).
కాషాయ పార్టీ సర్దుబాటు అందుకోసమే?
మొత్తంగా చూస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం అనేది మూడు పార్టీల ఉమ్మడి కృషి ఫలితం. అందులో ఒక పార్టీని ఎక్కువ మరో పార్టీని తక్కువ చేసి చూడలేం. అయితే, అధికార పంపిణీ, సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి.. రాష్ట్రంలో ‘పెద్దన్న’ పాత్ర టీడీపీదేనని, ఆ తర్వాతి స్థానం జనసేనదేనని ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో మరోసారి రుజువైంది. జాతీయ రాజకీయ ప్రయోజనాల కోసం, కేంద్రంలో స్థిరత్వం కోసం.. సర్దుకుపోతున్న AP BJP Alliance భవిష్యత్తులో ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.
