comedian Ramachandra: దీనస్థితిలో దుబాయ్ శీను బుజ్జి.. సాయం కోసం ఎదురుచూపులు!
దుబాయ్ శీను, వెంకీ, సొంతం, వంటి సినిమాలతో మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న బుజ్జి ప్రస్తుతం దీన పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నారు.

వెండితెరపై కనిపించి కడుపుబ్బ నవ్వించిన ఎంతోమంది హాస్య నటులు నిజ జీవితంలో మాత్రం తీవ్రమైన కష్టాలు, కన్నీళ్లను అనుభవిస్తున్నారు. తెరపై నవ్వులు పూయించే ఆ నవ్వుల వెనుక ఎన్నో విషాదాలు దాగి ఉంటున్నాయి. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు రామచంద్ర (బుజ్జి) తీవ్ర అనారోగ్య సమస్యతో ఆసుపత్రి పాలయ్యారు. తన వైద్య ఖర్చులకు సరిపడా డబ్బులు లేక, ఆదుకోవాలంటూ ఆయన కన్నీటి పర్యంతమవుతున్న దృశ్యాలు సినీ ప్రేమికులను తీవ్రంగా కలచివేస్తున్నాయి.
మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం
రవితేజ సూపర్ హిట్ చిత్రాలైన ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించారు రామచంద్ర. కొద్దిరోజుల క్రితం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్లు (Brain Clot) నిర్ధారణ అయింది. దీని కారణంగా ఆయన ఎడమ వైపు శరీరం పూర్తిగా పడిపోయి ఎడమ చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. ప్రస్తుతం ఆయన నడవలేని, కదలలేని స్థితిలో ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందుతున్నారు.
నిరంతర వైద్యం, మందులు, ఆసుపత్రి ఖర్చుల కోసం ఇప్పటికే కుటుంబం వద్ద ఉన్న డబ్బంతా ఖర్చయిపోయిందని. పైసా ఆదాయం లేక, రోజువారీ ఆసుపత్రి బిల్లులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపాడు. దాతలు ఎవరైనా ఉంటే తన సహాయం చేయాలని రామచంద్ర కోరారు.
గతంలో ఎన్నో చిత్రాల్లో కామెడీ పాత్రలు చేసి మనందరినీ నవ్వించిన రామచంద్ర నేడు ఇలాంటి దుర్భర స్థితిలో ఆసుపత్రి మంచంపై ఉండటం చూసి నెటిజన్లు, సినీ ప్రియులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. తోటి కళాకారుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) పెద్దలు, టాలీవుడ్ ప్రముఖులు, మరియు సినీ హీరోలు వెంటనే స్పందించి రామచంద్రకు అండగా నిలవాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని ఆయనకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని అభిమానులు కోరుతున్నారు.
