zptc mptc election results: పరిషత్ ఎన్నికల్లో..సిత్రలెన్నో
పరిషత్ ఎన్నికలు గతంతో పోల్చితే చాలా ప్రత్యేకంగా నిలిచాయి. నామినేషన్ల దగ్గర నుంచి ఫలితాల్లో వచ్చే గెలుపోటముల వరకు.. ప్రతిదీ కూడా ప్రత్యేకమే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పరిషత్ ఎన్నికల్లో దాదాపు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది

రాజకీయాలకు బంధుత్వం ఉండదు.. స్నేహం అంతకంటే ఉండదు.. కేవలం అవసరాలు, అవకాశాలు మాత్రమే ఉంటాయి. అన్నపై తమ్ముడు, తండ్రి పై కొడుకు.. అక్కపై చెల్లెలు.. ఇలా నా అనుకున్న వాళ్లే ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటూ బరిలో దిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని మించి.. ధనికులకైనా, పేదలకైనా ఎవరికైనా రాజకీయాలు అతీతం కావు. ఎవరైనా ఎప్పుడైనా పోటీ చేయవచ్చు.. ప్రజామోదంతో తిరుగులేని విజయం సొంతం చేసుకోవచ్చు.. ఇలాంటి చిత్ర విచిత్రాలు తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో (zptc mptc election results) చాలానే చోటు చేసుకున్నాయి. మరి అవేంటో చూద్దామా!
ప్రత్యేకంగా నిలిచిన పరిషత్ ఎన్నికలు!
ఈసారి పరిషత్ ఎన్నికలు గతంతో పోల్చితే చాలా ప్రత్యేకంగా నిలిచాయి. నామినేషన్ల దగ్గర నుంచి ఫలితాల్లో వచ్చే గెలుపోటముల వరకు.. ప్రతిదీ కూడా ప్రత్యేకమే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పరిషత్ ఎన్నికల్లో దాదాపు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. దీన్ని బట్టి చూస్తే పల్లె ప్రజలు ఓటింగ్ పై ఎంత ఆసక్తి చుపించారో అర్థం చేసుకోవచ్చు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ (zptc mptc election) విషయంలో ఓటర్లు ఎంత ఆసక్తి చూపించారో.. బరిలో నిలిచినా అభ్యర్థులు అంతే ప్రత్యేకంగా నిలిచారు. ఎందుకంటే పేరు మోసిన నాయకులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటారు. కృష్ణ జిల్లా పామర్రు జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన ఎస్టీ మహిళ శీలం వెంకటేశ్వరమ్మ టీడీపీ తరపున పోటీ చేసి 8,469 ఓట్ల మెజారిటీతో గెలిచి సత్తా చాటారు. నిరుపేద కుటుంబానికి చెందిన నీలం వెంకటేశ్వరమ్మ.. చిక్కు వెంట్రుకలు సేకరించి అమ్ముకుంటూ జీవనం సాగించేది. చాలీచాలని వ్యాపారంతోనే కుటుంబాన్ని పోసించేది. అయితే ఈసారి పాముర్రు జడ్పీటీసీ ఎస్టీలకు కేటాయించడంతో.. ఎన్నికల బరిలో నిలిచి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ప్రజల్లో ఆమెకుండే మంచి పేరు కారణంగానే ఇంతటి భారీ విజయం నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు.
పరిషత్ ఎన్నికల్లో బంధువులు
ఇక అక్కచెల్లెల్లు , అత్తాకోడళ్లు, అన్న తమ్ముళ్లు.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట మండలానికి చెందిన పొనుగుపాటి సత్యనారాయణ అయన కుమార్తె చాందిని వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి గెలుపొందారు. సత్యనారాయణ పలివెల-2 నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలవగా.. అయన కుమార్తె చాందిని కొత్తపేట-2 నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మరో చోట అత్తాకోడళ్లు బరిలో నిలిచి అందరిదృష్టి ని ఆకర్షించారు. ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు ఎంపీటీసీ స్థానానికి జ్యోతి నాగమణి టీడీపీ తరపున పోటీ చేయగా.. తూము సుప్రియ వైసీపీ నుంచి పోటీ చేశారు.. వరసకు అత్తాకోడళ్లు అయినా వీరిలో జ్యోతి నాగమణి విజయం సాధించారు.
చదువుల నుంచి పరిషత్ ఎన్నికల వైపు
మరోచోట.. బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న.. బొద్దు నాగసౌమ్య.. ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం.. సోమరాజుపల్లె ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి 300 పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన అత్యంత చిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించారు. కాకినాడ జిల్లాలో టేకుమూడి లక్ష్మణరావు దంపతులు, అలాగే యాళ్ల జగదీష్ దంపతులు వేర్వేరు స్థానాలకు ఎంపీటీసీ అభ్యర్థులుగా బరిలో నిలిచి గెలుపొందారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల.. కుటుంబ సభ్యులు బరిలో నిలిచి సత్తా చాటారు. ఓవరాల్ గా ఇలాంటి పరిణామాలు ఈసారి పరిషత్ ఎన్నికల్లో చాలానే చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనప్పటికి.. బలమైన నాయకులే కాకుండా.. సామాన్యులు కూడా ఎన్నికల్లో సత్తా చాటడం స్వాగతించాల్సిన విషయమే అంటున్నారు రాజకీయ పండితులు.
