ICC ODI World Cup 2027: భారత పేస్ బౌలింగ్‌కు అసలైన పరీక్ష!

ICC ODI World Cup 2027 కోసం టీమిండియా పేస్ బౌలింగ్ సన్నద్ధత ఎలా ఉంది? జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్ ఫామ్, యువ పేసర్ల అనుభవంపై పూర్తి క్రికెట్ విశ్లేషణ ఇక్కడ చదవండి.

1000056914

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా టోర్నీ 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ (ICC ODI World Cup 2027)కు రంగం సిద్ధమవుతోంది. టోర్నమెంట్ ప్రారంభానికి సరిగ్గా మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. అయితే ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్లన్ని పేసర్ల అడ్డా అయిన దక్షిణాఫ్రికా (దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త వేదికలు) పిచ్లపై జరగనుండటంతో భారత జట్టు కూర్పుపై ఇప్పటినుంచే తీవ్ర చర్చ మొదలైంది. భారత బ్యాటింగ్ లైనప్ ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ.. అత్యంత కీలకమైన ‘పేస్ బౌలింగ్ విభాగం’ భారత్ను తీవ్రంగా కలవరపెడుతోంది.

 

సౌతాఫ్రికా పిచ్లపై పేసర్లే కీలకం:

దక్షిణాఫ్రికాలోని పిచ్లు బౌన్స్, స్పీడ్కు పెట్టింది పేరు. అక్కడ మ్యాచ్లు గెలవాలంటే ప్రపంచ స్థాయి పేస్ అటాక్ తప్పనిసరి. కానీ ప్రస్తుత భారత జట్టు బౌలింగ్ విభాగాన్ని నిశితంగా పరిశీలిస్తే.. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మినహా నిలకడగా రాణించే మరో అగ్రశ్రేణి పేసర్ కనిపించకపోవడం మేనేజ్మెంట్ను నిద్రపట్టనివ్వడం లేదు. బుమ్రాపై మాత్రమే పూర్తి భారం పడితే, సుదీర్ఘమైన టోర్నీలో వర్క్లోడ్ మేనేజ్మెంట్ లేదా ఏదైనా చిన్న గాయం జరిగినా మొత్తం జట్టు సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది.

 

సిరాజ్ ఫామ్.. భారత్కు తలనొప్పి:

ఒకప్పుడు కొత్త బంతితో ప్రత్యర్థుల భరతం పట్టిన సిరాజ్ మియా (Mohammed Siraj) గత కొంతకాలంగా నిలకడలేమితో సతమతమవుతున్నాడు. వికెట్లు తీయడంలో వెనుకబడటమే కాకుండా ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం జట్టుకు మైనస్గా మారింది. మహమ్మద్ షమీ తర్వాత జట్టుకు రెండో ప్రధాన బౌలర్గా నిలవాల్సిన సిరాజ్ పేలవ ఫామ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

యువ పేసర్లపై ఆధారపడటం ఎంతవరకు సురక్షితం?

సెలెక్టర్ల దృష్టిలో ప్రస్తుతం పలువురు యువ పేసర్లు ఉన్నప్పటికీ.. మెగా టోర్నీలో ఆడేంత అనుభవం వీరిలో ఎవరికీ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. అర్ష్దీప్ సింగ్ (Arshdeep Singh) లెఫ్టార్మ్ యాంగిల్తో కొత్త బంతితో పాటు డెత్ ఓవర్లలో స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వన్డేల్లో సుదీర్ఘ స్పెల్స్ వేసే విషయంలో ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. హర్షిత్ రాణా (Harshit Rana), ప్రసిద్ధ్ కృష్ణ (Prasidh Krishna):వీరిద్దరి వద్ద మంచి వేగం, ఎత్తు వల్ల వచ్చే అదనపు బౌన్స్ ఉన్నాయి. అయితే గాయాల బెడద, కీలక సమయాల్లో ఒత్తిడి తట్టుకుని బౌలింగ్ చేసే నైపుణ్యంపై ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో ప్రతిభ చాటుతున్నప్పటికీ.. అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా సౌతాఫ్రికా లాంటి పరిస్థితుల్లో బలమైన ప్రత్యర్థులపై వీరు ఎంతవరకు ప్రభావం చూపగలరనేది ప్రశ్నార్థకమే.

 

మేనేజ్మెంట్ ముందున్న లక్ష్యాలు:

మరో ఏడాది గడువు ఉన్న నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్టర్లు పేస్ బౌలింగ్ బెంచ్ను పటిష్టం చేయడంపై వెంటనే దృష్టి సారించాలని క్రీడా విశ్లేషకులు చెప్తున్నారు. బుమ్రాకు జోడీగా నిలబడే కనీసం ఇద్దరు రెగ్యులర్ పేసర్లను రాబోయే ద్వైపాక్షిక సిరీస్లలో ఆడించి, సిరాజ్ తిరిగి ఫామ్లోకి వచ్చేలా తగిన అవకాశాలు కల్పించాలి. యువ పేసర్లను సౌతాఫ్రికా ‘ఎ’ పర్యటనలకు పంపి అక్కడి కండిషన్స్పై పట్టు సాధించేలా ప్రణాళికలు రచిస్తే టీమిండియా పేస్ విభాగం కొంత బలపడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

Leave a Reply