INDIAN DEMOCRACY| నా మాటల్లో: ప్రజాస్వామ్యమా? రాచరికమా?

Indian Democracy అని గర్వంగా చెప్పుకుంటున్న తరుణంలో ఎన్నికల వేళ హింస, అవినీతి రాజకీయాలు ఎటు దారితీస్తున్నాయి? ఓ జర్నలిస్టు దృక్కోణంలో రాసిన ఆలోచనాత్మక కథనం.

Indian Democracy ground reality and election analysis

ఎన్నికల వేళ ప్రజాస్వామ్య వ్యవస్థల తీరుతెన్నులపై ప్రత్యేక విశ్లేషణాత్మక కథనం.

మన దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా (Indian democracy) చెప్పుకుంటాం. ఇక్కడ ప్రజలే పాలకులని, ఒక పాలకుడిని ఎన్నుకునే హక్కు, అధికారం అన్నీ ప్రజలకే ఉంటాయని గొప్పగా చెబుతాం. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్న మంచి పరిణామం. కానీ, నిజంగానే మన దేశంలో అలా జరుగుతుందా? అనేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో చోటు చేసుకునే పరిణామాలను చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది. అసలు ఇది ప్రజాస్వామ్యమా లేక అధికార రాచరికమా అనేది ఏమీ అర్థం కాదు.

 

ఎన్నికలంటేనే దాడులు, ఘర్షణలా?

ఒక జర్నలిస్ట్ గా వార్తల కోసం సెర్చ్ చేసిన ప్రతిసారీ, ఎలక్షన్స్ అని వెతికితే నాకు కనిపించేవి ఇవే – ఎక్కడో దాడులు, ఎక్కడో ఘర్షణలు, ఎక్కడో కేసులు. ఇది సర్పంచ్ ఎన్నిక కావచ్చు, మున్సిపల్ ఎన్నిక కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు… స్థాయి ఏదైనా సరే, సీన్ మాత్రం ఒక్కటే. నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగిన వాళ్ళు, ఎన్నికలు రాగానే శత్రువుల్లా మారిపోతున్నారు. ప్రజలను ప్రజలు ఎన్నుకునే నాయకుడి విషయంలో కూడా ఎన్ని గొడవలో లెక్కే లేదు. అసలు మనిషి ఆలోచన అధికారం కోసమా? లేక ఈ మూర్ఖత్వమా? అనేది నాకు అర్థం కాదు. ప్రజల కోసం పని చేయాల్సిన వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియలోనే ఇంత హింస ఉంటే, గెలిచాక వాడు ప్రజల కోసం ఏం చేస్తాడు? అధికారంలోకి వస్తున్నది కేవలం ఘర్షణలు సృష్టించడానికి, దాడులు చేసుకోవడానికేనా అనిపిస్తుంది.

 

నిజంగా అధికారం ప్రజల చేతిలో ఉందా?

ప్రజాస్వామ్యం (Indian democracy) అంటే ప్రజలే పాలకులు అని. కానీ ఇప్పుడు చూస్తుంటే ప్రజలు కేవలం ఓటు వేసే యంత్రాలుగా మారిపోయారు. ఎన్నికల ముందు కాళ్ళు పట్టుకునే నాయకులు, ఎన్నికల తర్వాత కనిపించరు. వాళ్ళు మనల్ని మూర్ఖులుగా తయారు చేయట్లేదు, మనమే మూర్ఖులమై వారికి అధికారం ఇస్తున్నాం. వాళ్ళు అధికార మదంతో రాష్ట్రాన్ని, దేశాన్ని తొక్కేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా, రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా పరిస్థితి ఒక్కటే. అధికారంలోకి వచ్చిన వారు కోట్లు కోట్లు వెనకేసుకోవడం, ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం. ఎక్కడ చూసినా రోడ్లు చెడిపోవడం, ఏ వ్యవస్థలో చూసినా అవినీతి. ఇది నిత్యం కనిపిస్తున్న దృశ్యం.

 

డబ్బు, కులం, మద్యం-ఇదేనా ఎన్నికలంటే!

అసలు మన ఎన్నికల వ్యవస్థ ఎలా తయారైంది? ఇప్పుడు ఎన్నిక అంటే మూడు విషయాలుగా మారిపోయింది – డబ్బు, కులం, మద్యం.

మన రాష్ట్రమే తీసుకుందాం. అధికారంలో ఉన్న వారు అవినీతి చేశారని ప్రతిపక్షం అంటుంది. ప్రతిపక్షంలో ఉన్న వారు అవినీతి చేశారని అధికార పార్టీ అంటుంది. కానీ ఇక్కడ అందరూ మర్చిపోయేది ఒకటే – అవినీతి జరిగింది అనేది మాత్రం వాస్తవం. ఎవరు చేశారు అనేది పక్కన పెడితే, ప్రజాధనం లూటీ అయింది అనేది నిజం. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇంకా దారుణం ఏంటంటే, “మీరు అధికారంలోకి వస్తే ఇంత వైలెన్స్ ఉంటే, మేము వస్తే అంతకు మించి వైలెన్స్ చేస్తామంటూ” వార్నింగ్లు. ప్రజా సమస్యలను చూడాల్సిన నాయకులే ఇలా రౌడీల్లా బెదిరిస్తే, ఈ సమాజం ఎటు పోతుంది? ఇవి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా?

 

ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉందా?

ఇక ఎన్నికల కమిషన్ (election commission) విషయానికి వస్తే, అసలు ఈసీ చేతిలో ఉండాల్సిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తోందా? వాళ్ళను కూడా రాజకీయ నాయకులే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? అనేది పెద్ద సందేహం. గత 30 ఏళ్లుగా చూస్తే, ఎప్పుడు చూసినా ఈసీ వైఖరి ఏకపక్షంగానే ఉంటుందేమో అనే ఆలోచన వస్తూ ఉంటుంది. కేంద్రంలో ఏ సర్కార్ ఉన్నా, ఈసీ నిర్ణయాలు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నాయనే భావన ప్రజల్లో ఉంది. వ్యవస్థలు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి. రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర వ్యవస్థలు కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోతున్నాయా? అనే భయం మొదలైంది. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.

 

పాలకుడు ఎలా ఉండాలి? వ్యవస్థ ఎప్పుడు మారుతుంది?

నిజంగా పాలకుడు అనేవాడు ఎలా ఉండాలి? ప్రతిపక్షం ఏం చేసిందో వెతకడం కాదు, “మనం అధికారంలో ఉన్నాం, ప్రజలకు ఏం చేయగలం?” అనే దానిపై దృష్టి పెట్టాలి. కానీ నేడు అలా లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంత చేస్తే, మేము వస్తే అంతకు మించి చేస్తామంటూ హెచ్చరికలు. ఒక్కోసారి ఇది చూస్తుంటే అసహ్యం పుడుతుంది. ఈ వ్యవస్థ మారుతుందా లేదా అనేది అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది. దీనికి సమాధానం ఒక్కటే – వ్యవస్థ మారాలంటే మన ఆలోచనలో మార్పు రావాలి. ఒక ఓటును వెయ్యి రూపాయలకు, బిర్యానీకి, మద్యం బాటిల్ కి అమ్ముకున్నంత కాలం ఈ దాడులు, ఈ అవినీతి ఆగదు. నాయకుడికి తెలుసు – డబ్బులు పెడితే ఓట్లు వస్తాయని. అందుకే వాడు కోట్లు ఖర్చు పెడతాడు, గెలిచాక వంద కోట్లు దోచుకుంటాడు.

ఈ దుర్మార్గపు చక్రాన్ని ఆపాలంటే, రాబోయే ఏ ఎన్నికైనా సరే, అదే నాంది పలకాలి. పార్టీని చూసి కాదు, కులాన్ని చూసి కాదు, వ్యక్తిని, వాడి నిజాయితీని చూసి ఓటు వేద్దాం. డబ్బులు పంచేవాడిని కాదు, మన వీధిని బాగు చేసేవాడిని గెలిపిద్దాం.

అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది. లేదంటే మనం గర్వంగా చెప్పుకునే ఈ “అతిపెద్ద ప్రజాస్వామ్యం” (Indian democracy) అనే మాట కేవలం పుస్తకాల్లోనే మిగిలిపోతుంది.

           రైటర్- ఎం. కె