నా మాటల్లో: ఆచారం కోసం హత్యలా.. ఎక్కడుంది మానవత్వం!
కర్నూలు బన్నీ ఉత్సవం: దేవుడి పేరిట కర్రల సమరం, రక్తపాతంపై మనసును కలచివేసిన వ్యక్తిగత ఆలోచనలు. భక్తి పేరిట ప్రాణాలు పణంగా పెట్టే ఆచారాలపై లోతైన విశ్లేషణ.

రోజూలాగే ఈ రోజు ఉదయం కూడా నిద్రలేవగానే చేతిలోకి ఫోన్ తీసుకున్నాను. వార్తా ప్రపంచంలో ఏం జరుగుతోంది, దేశంలోనూ మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయో గమనిస్తూ ఒక్కొక్క వార్తనూ పరిశీలించడం నాకో అలవాటు. ఒక జర్నలిస్టుగా, నిరంతరం అక్షరాలతో ప్రయాణం చేసే ఒక మనిషిగా సమాజంలో జరిగే అనేక విషయాలు నా కళ్లముందు కదలాడుతుంటాయి. కానీ కొన్ని వార్తలు కేవలం సమాచారంగా మాత్రమే మిగిలిపోవు. అవి మనసు లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, గుండెను బరువెక్కించి, తీవ్రమైన అంతర్మథనానికి గురిచేస్తాయి. ఈ రోజు ఉదయం నన్ను నిశ్చేష్టుడిని చేసి, లోతైన ఆలోచనల్లోకి నెట్టిన ఒక విషాదకర వార్త కర్నూలు బన్నీ ఉత్సవం అక్కడ చోటుచేసుకున్న రక్తసిక్త దృశ్యాలే.
అది దేవుడి ఉత్సవమా లేక యుద్ధ క్షేత్రమా?
దసరా అనగానే మనందరికీ గుర్తొచ్చేది చెడుపై మంచి సాధించిన విజయం. చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగులు, కుటుంబ సభ్యులంతా కలిసి చేసుకునే పండుగ సంబరాలు, విజయదశమి నాటి ఆత్మీయ కలయికలు. కానీ కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతంలో దసరా అర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవం దృశ్యాలు చూస్తుంటే మాత్రం పండుగ వాతావరణం ఎక్కడా కనిపించదు. నా స్క్రీన్ పై ప్రత్యక్షమైన ఆ వీడియో విజువల్స్ చూస్తున్నంతసేపు ఒళ్లు గగుర్పొడిచింది. చేతుల్లో పొడవాటి కర్రలు, ఆ కర్రల చివర బిగించిన ఇనుప రింగులు, కళ్లకు కట్టినట్లు కనిపించే రక్తపు చారికలు, ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న వందలాది మంది మనుషులు. ఇది దేవుడి పండుగా లేక ఏవైనా శత్రు దేశాల మధ్య జరుగుతున్న భీకర సమరమా అన్న భావన నాలో కలిగింది.
ఆ దృశ్యాలను నిశితంగా గమనిస్తున్న కొద్దీ నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి ఆచారం వెనుక ఒక జ్ఞాపకం ఉండాలి. మన తాతలు ఎలా బతికారు, ఏం నమ్మారు, ఏ కథను తమ పిల్లలకు చెప్పాలనుకున్నారు అనే జ్ఞాపకం. ఆ జ్ఞాపకాన్ని నెమరువేసుకోవడమే ఆచారం అవ్వాలి. పూర్వీకులు అందించిన వారసత్వాన్ని గౌరవించడంలో తప్పులేదు. కానీ ఆ ఆచారాలు మనుషుల ప్రాణాలు తీయడం ఎంతవరకు కరెక్టు? దేవుడి పేరుతో రక్తపాతం సృష్టించడం ఏ రకమైన భక్తి? ఈ ప్రశ్నలు నన్ను తీవ్రమైన కలవరానికి గురిచేస్తున్నాయి.
ఆచారం వెనుక ఉన్న కథ.. మారని మానవ ధోరణి
ఈ ఉత్సవం వెనుక ఉన్న మూలాలను మరింత లోతుగా తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పుడు నాకు ఎంతో విస్మయం కలిగింది. ఆ కొండపై కొలువైన మాల మల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకోవడమే ఈ కర్రల సమరానికి అసలు కారణం. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఏ గ్రామం ప్రజలు తమ ఊరికి తీసుకువెళ్తే ఆ గ్రామానికి మంచి జరుగుతుందని, పంటలు బాగా పండుతాయని, గ్రామం సుభిక్షంగా ఉంటుందని వారి ప్రగాఢ విశ్వాసం. ఆ విగ్రహాన్ని ఇతర గ్రామాల ప్రజలు తాకకుండా, తమ గ్రామానికి తీసుకెళ్లే క్రమంలో మూడు నాలుగు గ్రామాల ప్రజలు పోటీపడతారు. ఆ పోటీయే చివరికి భీకర కర్రల యుద్ధంగా మారుతుంది.
ఇక్కడ కాస్త వివేకంతో ఆలోచిస్తే.. సమస్త జీవులను ప్రేమతో కాపాడే భగవంతుడికి, తన బిడ్డలు రక్తమోడుతూ ఒకరినొకరు చంపుకునేంతగా కొట్టుకోవడం ఇష్టమవుతుందా? దేవుడు బాగుండాలని కోరుకునేవాడయితే, తన పేరుతో మనుషులు రక్తం చిందించుకుంటుంటే చూస్తూ ఊరుకుంటాడా? మన ఊరు బాగుండాలని కోరుకుంటూ, పక్క ఊరి వాడి తల పగలగొట్టడం ఏ రకమైన బాగు? మన ఊరు బాగుండాలని కోరుకోవడంలో అర్థం ఉంది, కానీ పక్క ఊరి వాడి తల పగలగొట్టి, వాడి ప్రాణాలు తీసి తెచ్చుకునే దేవుడి ఆశీస్సులు మనకు సుఖసంతోషాలను ఇస్తాయా? ఈ పాశవిక చర్యను భక్తి అనాలా లేక మూఢనమ్మకపు మత్తు అనాలా? ఇది భక్తి కాదు, నిజంగా పాశవితే. నేను ఈ మాటను చాలా బాధతో, చాలా కోపంతో అంటున్నాను. ఎందుకంటే ఆ దృశ్యాలలో నాకు భక్తి కనిపించలేదు. కేవలం పాశవికంగా అనుసరించే మూఢనమ్మకం మాత్రమే కనిపించింది.
మారని మనిషి ఆలోచన.. మేల్కొనని వ్యవస్థలు
నేను ఆ దృశ్యాలు చూస్తూ రెండు విషయాలు గమనించాను. అక్కడ ఎవరూ ఒంటరిగా కొట్టుకోవడం లేదు. అందరూ గుంపుగా ఉన్నారు. గుంపులో ఉన్నప్పుడు మనిషి మనిషిగా ఆలోచించడు. గుంపు ఆలోచిస్తుంది.”మన ఊరి పరువు పోతుంది” అనే ఒక్క మాట చాలు, ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరి విచక్షణను చంపేయడానికి. అప్పుడు ఎదురుగా ఉన్నవాడు మనిషిలా కనిపించడు, ప్రత్యర్థిలానే కనిపిస్తాడు. రెండో విషయం, ఆ భయం. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని ఆపితే దేవుడు శపిస్తాడనే భయం. నిజం చెప్పాలంటే, ఈ భయాన్ని మనమే సృష్టించుకున్నాం. దేవుడి పేరు చెప్పి, మన హింసను సమర్థించుకునే భయం ఇది.
ఈ ఏడాది జరిగిన బన్నీ ఉత్సవంలో కూడా దాదాపు వంద మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. తలలు పగిలి, ఎముకలు విరిగి నెత్తుటి మడుగుల్లో కొట్టుమిట్టాడుతున్న ఎంతోమంది దృశ్యాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటనలు కూడా నమోదయ్యాయి. ఒక కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు, కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి ఆ కొండపై శవమై తేలితే ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటి? భక్తి పేరిట క్షణికావేశంలో చేసే ఈ కర్రల కొట్లాట ఆ కుటుంబాల్లో జీవితాంతం తీరని శోకాన్ని మిగులుస్తుంది కదా! ఆ ఆలోచన అక్కడ ఉన్నవారిలో ఎవరికి లేకపోవడం మూర్ఖత్వం అనుకోవాలా? ఇంకేం అనుకోవాలి! యుగాలు మారాయి, తరాలు మారాయి. మనిషి మేరస్సు ఖండాంతరాలు దాటి విశ్వం వైపు పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో కూడా మనం ఇంకా అదే కర్రను పట్టుకుని ఉన్నాం. మన టెక్నాలజీ మారింది, కానీ మన ఆలోచన ఇంకా అక్కడే ఆగిపోయి ఉంది. ఇది చూసినప్పుడే నాకు చాలా బాధ వేసింది.
అన్నింటికంటే నన్ను మరీ ఎక్కువగా ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటంటే.. ఇంత పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతున్నా.. ఆపాల్సినా వ్యవస్థలు మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తున్నాయి. కొన్ని వందల మంది కర్రలతో కొట్టుకుంటుంటే నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిస్సహాయంగా ఉండిపోవడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక సవాలు. తరతరాలుగా వస్తున్న ఆచారాలనే నెపంతో ప్రభుత్వం గానీ, కోర్టులు గానీ ఇలాంటి హింసాత్మక సంప్రదాయాలను రద్దు చేయడానికి వెనకడుగు వేయడం అత్యంత దురదృష్టకరం.
నేను కేవలం ఈ బన్నూ ఉత్సవం గురించి మాత్రమే చెప్పట్లేదు. ఆచారాల పేరుతో ఇలాంటి రక్తపాత ఘటనలు మన దేశంలో ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయి. దేవుడి పేరుతో మనిషిని మర్చిపోవడం. నమ్మకం పేరుతో ప్రాణాన్ని తేలికగా తీసుకోవడం. ఇందులో ఎక్కడుంది దైవత్వం? ఏడుంది మానవత్వం? ఒక పండుగ తర్వాత ఆ ఊర్లో వంద ఇళ్ళలో ఏడుపులు వినిపిస్తే, అది పండుగ ఎలా అవుతుంది? ఒక ఉత్సవం తర్వాత హాస్పిటల్ బెడ్లు నిండిపోతే, ఆ ఉత్సవం వల్ల ఎవరికి లాభం? నేను దేవున్ని నమ్ముతాను. కానీ నేను నమ్మే దేవుడు రక్తాన్ని అడగడు. నేను నమ్మే దేవుడు నన్ను పక్కవాడిని కొట్టమని చెప్పడు.
నేను ఒక జర్నలిస్ట్ గా కాదు, ఒక మనిషిగా అడుగుతున్నాను. మనకు ఇలాంటి ఆచారాలు అవసరమా?
ఇంకెన్నాళ్లు ఆ రాతియుగపు ఆలోచనలు
మనం ఇరవై ఒకటో శతాబ్దంలో జీవిస్తున్నాం. అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చుకుంటున్నాం. నాగరికత ఇంతగా అభివృద్ధి చెందిన సమాజంలో, ఇంకా ఒక చెక్క కర్ర పట్టుకుని పక్క మనిషి ప్రాణం తీసే సంస్కృతిని కొనసాగించడం మన విజ్ఞతకే అవమానం. సంప్రదాయాలు మనుషులను కలపాలి గానీ, విభజించకూడదు. ఆచారాలు జీవన సౌందర్యాన్ని పెంచాలి గానీ, జీవించే హక్కును కాలరాయకూడదు. ఆ కర్ర పట్టుకున్న ప్రతి చేయి ఒక్కసారి ఆలోచించాలి. నేను ఎవరిని కొడుతున్నాను? నా పక్క ఊరి రైతునా? నాతో కలిసి పొలం పనులు చేసే అన్ననా? నా బిడ్డతో కలిసి స్కూల్ కి వెళ్ళే పక్కింటి అబ్బాయి తండ్రినా? ఈ ప్రశ్న ఆ కర్ర పట్టుకున్న ప్రతి ఒక్కరూ వేసుకున్న రోజు, బన్నీ ఉత్సవం ఆగిపోదు, దాని రూపం మారుతుంది. ఆ రక్తపాతం ఆగి, అది నిజంగా ఒక కలయిక ఉత్సవంగా మారుతుంది. దేవుడి విగ్రహాన్ని లాక్కోవడం కాదు, దేవుడి కథను కలిసి చెప్పుకోవడం ఉత్సవంగా మారుతుంది.
ఈ రోజు నేను రాస్తున్న ఈ అక్షరాలు కేవలం ఒక వార్తా విశ్లేషణ మాత్రమే కాదు. నా మనసులోని ఆవేదన, ఒక సగటు మనిషిగా నన్ను వేధించిన ప్రశ్నల సమాహారం. ఇప్పటికైనా ఆయా గ్రామాల పెద్దలు, యువత, విద్యావంతులు ఆలోచించాలి. పండుగను భక్తిశ్రద్ధలతో, పూజాదికాలతో ఆనందంగా జరుపుకుందాం. కానీ ప్రాణాలు తీసే కర్రలను విడిచిపెడదాం. రక్తపాతం లేని పండుగలే నిజమైన దైవ కృపకు నిదర్శనమని గ్రహించిన రోజే సమాజానికి నిజమైన విజయం లభిస్తుంది.
నేను ఆశావాదిని. నేను ఇంకా నమ్ముతున్నాను. ఏదోక రోజు దేవరగట్టు కొండపై కర్రల శబ్దం కాదు, మనుషుల నవ్వుల శబ్దం వినిపిస్తుందని కోరుకుందాం. ఆ రోజు కోసమే ఎదురుచూద్దాం!
– రైటర్ ఎం.కె
