Jagan vs Sharmila: అన్నాచెల్లెళ్ల వైరం.. వెనకున్న చీకటి కోణం!
Jagan vs Sharmila: ఇద్దరి మధ్య వివాదం ఎలా మొదలైంది? అన్నా చెల్లెలు బద్ధ శత్రువుల ఎలా మారిపోయారు? వీరిద్దరి మధ్య వివాదాల వెనుకున్న చీకటి కోణంపై పూర్తి కథనం.

జగన్, షర్మిల మధ్య వివాదాల వెనుకున్న చీకటి కోణం
Jagan vs Sharmila:గత కొన్నాళ్లుగా వైఎస్ కుటుంబంలో జరుగుతున్న వివాదాలు, తగాదాలు అన్ని ఇన్ని కావు. ముఖ్యంగా అన్న జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలకు మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేంతలా వైరం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు చెల్లె తన దైర్యం అని చెప్పిన అన్నేమో ఇప్పుడు ఆ చెల్లిని దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు. మరోవైపు అన్నే తనకు అన్ని అని చెప్పిన చెల్లేమో ఆయన అన్న కాదు కసాయి అంటూ నిప్పులు చెరుగుతోంది. మరి ఒకప్పుడు పాలు నీళ్లలా కలిసున్న అన్నాచెల్లెళ్లు ఇప్పుడు ఉప్పు నిప్పులా ఎందుకు మారారు. అసలు వైఎస్ కుటుంబంలో జరుగుతోంది? అన్నా చెల్లెళ్ల మధ్య వైరం ఎందుకు ముదురుతోంది? ఇది కేవలం కుటుంబ కలహమా… లేక ఏపీ రాజకీయాలను కుదిపేసే అంశమా? ఒకప్పుడు చెల్లెలి (YS Sharmila) పాదయాత్రతో సింహాసనం ఎక్కిన అన్న… ఇవాళ అదే చెల్లెలిని అడ్డుకోవడానికి ఏకంగా కోర్టు మెట్లు ఎక్కడం వెనకున్న చీకటి కోణమేంటి! అసలు యలహంక ప్యాలస్ వెనకున్న నిజాలేంటి? జగన్ షర్మిల మధ్య ఈ వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది? వైసీపీ పునాదులను కదిలిస్తుందా… లేక షర్మిల పొలిటికల్ గ్రాఫ్‌ను మలుపు తిప్పుతుందా? నేటి స్టోరీ బోర్డు లో చూద్దాం!
Jagan vs Sharmila: షర్మిల అండతోనే అధికారం!
ఏపీలో ఒకవైపు ఎన్నికల వేడి సెగరేపుతుంటే.. మరోవైపు వైఎస్ కుటుంబంలో కలహాలు కల్లోలం పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు నివురుగప్పిన నిప్పులా ఉన్న జగన్ షర్మిల విభేదాలు ఇప్పుడు ఉప్పు నిప్పులా మారి ఏపీ రాజకీయాలను చిటపటలాడిస్తున్నాయి. 2024 ఎన్నికల ముందు మొదలైన రచ్చ.. ఇప్పటికి కుదిపేస్తూనే ఉంది. ఒకప్పుడు ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ కనబరిచే అన్నా చెల్లెల్లు ఇప్పుడెందుకు బద్ద శత్రువులుగా మారారు? అనే దానిపై రకరకాల ఊహాగానాలు, ఎన్నో వాస్తవాలు పుట్టలు పుట్టలుగా బయటకు వస్తాయి. ముఖ్యంగా ఆస్తి పంపకాలు అని కొందరంటే.. కాదు కాదు రాజకీయ అధిపత్యాలని మరికొందరంటారు. ఇవన్నీ కాదు.. అవి వారి కుటుంబ విషయాలు అనే వారు కూడా లేకపోలేదు. అయితే ఎవరెన్ని చెప్పినా.. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం మాత్రం ఓ రేంజ్ లో ఉందన్నది అందరికి తెలిసిన వాస్తవం. 2019 ఎన్నికల ముందు జగన్ షర్మిల మధ్య అనుబంధం ఒకలా ఉంటే 2019 తరువాత మరోలా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తొలినాళ్ళలో ఆ పార్టీ.. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది. ముఖ్యంగా అధినేత వైఎస్ జగన్ (YS Jagan) సీబీఐ కేసుల్లో ఇరుక్కోవడం, పార్టీకి సంస్థాగత బలం లేకపోవడం.. ఇలాంటి ఎన్నో అవరోధాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాడిలో పెట్టేందుకు వైఎస్ షర్మిల ముందుకొచ్చారు. కష్టకాలంలో పార్టీ క్యాడర్లలో జోష్ నింపడానికి మరో ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రకు పూనుకున్నారు. దాదాపు 200 రోజులు నిర్విరామంగా పాదయాత్ర చేసి 3 వేలకు పైగా కిలోమీటర్లు నడిచి.. వందకు పైగా నియోజక వర్గాలను చుట్టొచ్చారు. ఆ టైంలో షర్మిల పాదయాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతలా బూస్ట్ ఇచ్చిందంటే.. 2019లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది. దీంతో ఆమెకు పార్టీకి కీలక పదవి ఇస్తారని.. కేబినెట్ లో చోటు కల్పిస్తారని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షర్మిల నెంబర్ టూ గా ఉంటారని ఇలా ఎన్నో అభిప్రాయాలూ వ్యక్తమవుతు వచ్చాయి.
read also: Yelahanka Palace Jagan: యలహంక ప్రాపర్టీ నాదే.. వైఎస్ జగన్‌కు షర్మిల కౌంటర్!
Jagan vs Sharmila: మారిన జగన్ వైఖరి!
కట్ చేస్తే జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత షర్మిలను ఒక్కసారిగా పక్కన పెట్టేశారాయన. పార్టీ కోసం అంత కష్టపడ్డ తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంపై షర్మిల అసంతృప్తి చెందారనే వాదనలు వినిపించాయి. అంతకు ముందు అన్నే తనకు అన్ని అంటూ చెబుతూ వచ్చిన ఆమె.. అన్న గురించి ప్రస్తావించడం మెల్లగా తగ్గిస్తూవచ్చారు. దీనికి తోడు ఆస్తి పంపకాల్లో కూడా అవకతవకలు జరగడంతో జగన్, షర్మిల మధ్య దూరం మరింత పెరిగింది. అదే టైంలో వైఎస్ వివేకా హత్య కేసు కూడా తెరపైకి రావడం.. ఆ కేసు విషయంలో నిందితులకు జగన్ అండగా నిలుస్తున్నారని షర్మిల బహిరంగంగానే విమర్శించడం వంటి కారణాలతో.. అన్నా చెల్లెల్లు కాస్త బద్ద శత్రువుల్లా మారిపోయారనేది పొలిటికల్ పండితులు చెప్పే మాట.ముఖ్యంగా 2019లో కుటుంబ ఆస్తుల పంపకాలకు సంబంధించి ఒక అవగాహన ఒప్పందం (MoU) జరిగిందని, దాని ప్రకారం ‘సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్’ షేర్లు, మరికొన్ని ఆస్తులు షర్మిలకు చెందాల్సి ఉందని విజయమ్మ, షర్మిల వాదిస్తున్నారు. అయితే, న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాతే బదిలీ జరగాలని, షర్మిల అక్రమంగా షేర్లను బదిలీ చేసుకున్నారని జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ను ఆశ్రయించడంతో అన్నా చెల్లెళ్ళ వివాదం రచ్చకెక్కింది. ఈ వివాదాల కారణంగా హర్మిల తెలంగాణకు షిఫ్ట్ అయి అక్కడ ప్రత్యేక పార్టీ పెట్టి రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేశారు. కానీ రాజకీయంగా ఆశించిన మైలేజ్ రాకపోవడంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. తిరిగి ఏపీకి వచ్చి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టారు. ఆ తరువాత నుంచి నేరుగా జగన్ టార్గెట్ గా షర్మిల చేసిన వ్యాఖ్యలైతేనేమి, విమర్శలైతేనేమి.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
Jagan vs Sharmila ప్యాలస్ గోల!
2024 ఎన్నికల ముందు అప్పటి జగన్ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేస్తూ.. ఇరుకున పెట్టడంలో ఒకింత షర్మిల సక్సస్ అయ్యారు. ఇలా అన్న చెల్లెళ్ళ మధ్య కుటుంబ వివాదాలతో మొదలైన అగాదం.. రాజకీయంగా చిలికి చిలికి గాలి వానగా మారింది. ప్రస్తుతం జగన్ షర్మిల మధ్య వైరం కోర్టు మెట్లు ఎక్కేవరకు వెళ్ళింది.. మరి ఈ వైరం జగన్ ఇమేజ్ ను డ్యామ్జ్ చేస్తుందా..! లేదా షర్మిల పొలిటికల్ గ్రాఫ్ ను తగ్గిస్తుందా! జగన్ షర్మిల మధ్య గతంలో జరిగిన వివాదాలు ఒకెత్తయితే.. యలహంక ప్యాలస్ విషయంలో మొదలైన వివాదం మరో ఎత్తు. సరిగ్గా ఏపీలో స్థానిక ఎన్నికల వేళా.. షర్మిల కూతురి వివాహాన్ని యలహంక ప్యాలస్ లో ప్రకటించడం.. దానికి జగన్ నో చెప్పడంతో వైరం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. నవంబర్ 26న షర్మిల తన కూతురు అంజలి రెడ్డి వివాహాన్ని యలహంక ప్యాలస్ లో అతిరథ మహారతుల మధ్య ఘనంగా చేయాలనీ నిర్ణయించారు. కానీ ఆలా చేయడం వల్ల తనకు భద్రతా పరమైన సమస్యలు తలెత్తుతాయని, యలహంక ప్యాలస్ పై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, యలహంకలో కాకుండా మరో వేదికలో వివాహం జరిపించుకోవాలని వైఎస్ జగన్ ఏకంగా బహిరంగ లేక విధాలా చేశారు. దీంతో అగ్గి రాజుకుంది. శుభకార్యం వేళా షర్మిలను జగన్ ఇబ్బంది పెడుతున్నారని, ఇలా చేయడం కరెక్ట్ కాదని జగన్ ను తప్పుబడుతూ రకరకాల వాదనలు బయటకు వచ్చాయి. అదే టైంలో జగన్ ను సమర్థించిన వారు కూడా లేకపోలేదు.
కోర్టుకు చేరిన కలహాలు
ఇలా ఎన్నో పరిణామాల తరువాత వైఎస్ షర్మిల తన కూతురి వివాహాన్ని యలహంక ప్యాలస్ లో కాకుండా మరో ప్రదేశానికి మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇంతటితోనే వివాదం సద్దుమణగలేదు. యలహంక ప్యాలస్ పై సర్వ హక్కులు తనకే ఉన్నాయని, ఆస్తి పంపకాల్లో ప్యాలస్ తనకే వచ్చిందని చెప్పి బాంబ్ పేల్చారు. అయినా శుభకార్యం ముందు రాజకీయం చేయడం ఇష్టంలేదంటూ వ్యాఖ్యానించారు. ఇదే క్రమంలోనే పెళ్లి పనుల్లో బిజీ అయినా షర్మిల.. మహా మహులను పెళ్లికి ఆహ్వానిస్తూ, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్,. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. వంటి వారికీ శుభలేఖలు పంచుతూ వచ్చారు. అయితే చంద్రబాబుకు శుభలేఖ ఇచ్చిన పరిణామం.. ఓ దిన పత్రికలో ఇచ్చిన కథనంతో వివాదాస్పదమైంది. చంద్రబాబుతో చెట్టపట్టాలు అంటూ పిచ్చి రాతలు రాస్తున్నారని, తండ్రి లాంటి వ్యక్తితో అంటగడుతూ.. ఇలాంటి రాతలా రాసేది అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు షర్మిల. అటు ఈ అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సైతం అసహనం వ్యక్తం చేశారు. ఇంతా నీచ రాజకీయాలు చేయాలా? అంటూ వైసీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఇలా అన్న చెల్లెళ్ళ మధ్య కొనసాగిన వార్ ఎపిసోడ్.. గత నెల రోజులుగా ఓ రేంజ్ లో రక్తి కట్టిస్తోంది.ఇక తాజాగా పెళ్లి పనుల్లో భాగంగా షర్మిల యలహంక ప్యాలస్ వెళ్తున్న క్రమంలో తానూ ప్యాలస్ లోకి రాకూడదంటూ జగన్ ఏకంగా కోర్టును ఆశ్రయించడంతో.. ఈ వ్యవహారం మరింత రచ్చరేగుతోంది. అయితే ఈ పిటిషన్ నేరుగా జగన్ పేరుమీదుగా కాకుండా సిలికాన్ బిల్డర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ పేరుతొ బెంగళూరు రూరల్ పరిధిలోని దేవనహళ్లి సీనియర్ సివిల్, జేఎంఎఫ్‌సీ కోర్టులో పిటిషన్ దాఖలైంది.
Jagan vs Sharmila వివాదంతో చిక్కులు
గతంలో ఈ సంస్థకు వైఎస్ భారతి డైరెక్టర్ గా పని చేశారు. పిటిషన్ లో ఉన్న వివరాల ప్రకారం యలహంక సమీపంలోని కట్టిగెనహళ్లి పరిధిలో ఉన్న ఈ ఆస్తి 2006 నుండి జగన్ అత్తగారు (వైఎస్ భారతి తల్లి) ఇ.సి. సుగుణమ్మ పేరిట ఉందని, ఆమె 2007 మార్చి 1న 20 ఏళ్ల కాలపరిమితితో (2027 ఫిబ్రవరి వరకు) తమ సంస్థకు లీజుకు ఇచ్చారని సిలికాన్ బిల్డర్స్ కోర్టుకు తెలిపింది. అప్పటి నుంచి అద్దె, కరెంట్ బిల్లులు, సెక్యూరిటీ మరియు నిర్వహణ ఖర్చులన్నీ తామే భరిస్తున్నామని సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో యలహంక ప్యాలస్ పై తనకు కూడా హక్కు ఉందని చెబుతున్న షర్మిల.. రియాక్ట్ అవ్వకముందే కోర్టు నుంచి తీర్పు ప్రతికూలంగా రావడం ఆమెకు గట్టి ఎదురు దెబ్బె. షర్మిలకు కోర్టులో ఎదురుదెబ్బె. దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన దేవనహళ్లి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, సిలికాన్ బిల్డర్స్ సమర్పించిన లీజు పత్రాలు, బిల్లులను పరిశీలించిన అనంతరం షర్మిలకు వ్యతిరేకంగా మధ్యంతర నిషేధాజ్ఞలు జారీ చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు వైఎస్ షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు, ప్రతినిధులు లేదా అనుచరులు వివాదాస్పద స్థలంలోకి ప్రవేశించకూడదని, అక్కడి నిర్మాణాలు, గెస్ట్ హౌస్‌లు, తోటలు, ఇతర ఆస్తుల విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతో వైఎస్ షర్మిలకు గట్టి షాక్ తగిలింది. మొత్తానికి ఇలా వివాదాస్పద పరిణామాలతో అన్నా చెల్లెళ్ల మధ్య వార్ ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. మరి తాజా పరిస్థితులపై షర్మిల తనదైన రీతిలో స్పందిస్తారా? లేదా ఇంతటితో చాలు అంటూ సైలెంట్ అయిపోతారా? అనేది వేచి చూడాలి.
