నా జ్ఞాపకాల్లో: నిలిచిపోయిన ‘నేనున్నాను’.. మొదటిసారి గడప దాటిన వేళ!

నా జ్ఞాపకాలు: నేనున్నాను మూవీ టైంలో నా జీవితంలో జరిగిన సంఘటనలు

1000057191
చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది. ఆ రోజుల్లో మనం అనుభవించిన స్మృతులు అలాంటివి మరి! జీవితంలో ఎంత ఎదిగినా, ఎన్ని ఊళ్లు తిరిగినా.. ఆనాటి అమాయకపు తీపి గుర్తులు ఏదో ఒక రూపంలో మనల్ని తారసపడుతూనే ఉంటాయి.

ఇవాళ సాయంత్రం పనిమీద అలా బయటకు వెళ్లినప్పుడు ఒక దృశ్యం నా కంటపడింది. వీధి చివర సర్కస్ టెంట్ వేస్తూ ఒక పోల్కు రెండు వైపులా పెద్ద మైకులు కట్టారు. ఆ మైకుల్లో ‘నేనున్నాను’ సినిమాలోని ” వేసవికాలం వెన్నెలగా.. వానల్లో వాగుల్లాగా వయసు ఎవరికోసం.. నికోసం.. నికోసం” అనే పాట మోగుతోంది. “ఈరోజు సాయంత్రం మన ఊరికి సర్కస్ వచ్చింది.. డ్యాన్స్ ప్రోగ్రాం ఉంటుంది..” అంటూ అనౌన్స్మెంట్ వినిపిస్తోంది. ఆ పాట, మైకు సౌండ్ వినగానే నా మనస్సు ఒక్కసారిగా కాలచక్రంలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. నా బాల్యాన్ని, నన్ను నేను చూసుకున్న సరికొత్త ప్రపంచాన్ని నా కళ్లముందు నిలిపింది.

 

అమాయకత్వానికి కేరాఫ్.. 5వ తరగతి రోజుల జ్ఞాపకాలు:

ఆ పాట వినగానే నాకు ‘నేనున్నాను’ సినిమాతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు మెదిలాయి. ఆ మూవీ అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. అప్పుడు నేను ఐదో తరగతి చదువుతున్నాను. ఉదయం లేవగానే గబగబా బ్రష్ చేసుకుని, అమ్మ పెట్టిన గంజన్నం తిని స్కూలుకు పరుగు తీయడం.. సాయంత్రం నాలుగు కాగానే బస్తా సంచీ భుజాన వేసుకుని ఆడుకుంటూ ఇల్లు చేరడం.. ఇంతే మా ప్రపంచం. ఆ రోజుల్లో ఊర్లోకి సర్కస్ వస్తే అదొక పెద్ద పండగ. మేమంతా టెంట్ చుట్టూ చేరి పాటలకు స్టెప్పులు వేయడం, జోకర్ చేసే విన్యాసాలను కథలు కథలుగా చెప్పుకుంటూ ఎంత సంబర పడే వాళ్లమో మాటల్లో చెప్పలేను.

 

ఊరు దాటని పిల్లాడికి.. ‘గురుకుల ఎగ్జామ్’ పిలుపు:

నేను కాస్త బాగా చదువుతానని మా హెచ్ఎం (HM) గారు నాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. “నువ్వు 6వ తరగతి కోసం గురుకుల పాఠశాల ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలిరా.. మంచి భవిష్యత్తు ఉంటుంది” అని చెప్పారు. అప్పటివరకు నాకు ఎగ్జామ్ అంటే స్కూల్లో మాస్టారు పలకపై రాసిచ్చే ప్రశ్నలు, అసైన్మెంట్లు మాత్రమే తెలుసు. ఊరు దాటి వేరే చోట ఎగ్జామ్ రాయడం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ మా నాన్నకు లోకజ్ఞానం ఎక్కువ ఉండటంతో వెంటనే సరేనని ఒప్పేసుకున్నారు. నాతో పాటు మరో నలుగురు క్లాస్మేట్స్ సెలెక్ట్ అయ్యారు. ఎగ్జామ్ సెంటర్ ‘బెల్గల్’ అనే ఊరు. మా ఊరి నుంచి దాదాపు 100-120 కిలోమీటర్ల దూరం. ఇప్పుడైతే గంట గంటన్నర ప్రయాణం కావొచ్చు, కానీ అప్పట్లో నా ఊరు, అమ్మమ్మ ఊరు తప్ప వేరే ప్రపంచం ఎరుగని నాకు అది విదేశానికి వెళ్తున్నంత అనుభూతి!

 

సినిమా పిచ్చి.. ఆటో ప్రయాణంలో వాంతుల గోల:

ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. అప్పట్లో టీవీల్లో, రేడియోల్లో, చివరికి పొలాల్లో వెళ్లే ట్రాక్టర్ల స్పీకర్లలో కూడా ‘నేనున్నాను’ పాటలే మార్మోగేవి. ఎగ్జామ్ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటే.. మేము ఉదయం 6 గంటలకే పయనమయ్యాం. అమ్మ కొత్త బట్టలు వేసి, కొబ్బరినూనె రాసి పక్క పాపిడి దువ్వి ముస్తాబు చేసి పంపించింది. నాన్న కూడా తోడు వచ్చాడు. నాతో వచ్చిన ఫ్రెండ్స్ ఎంచక్కా దొరల్లా రెడీ అయి సంబరపడిపోతున్నారు. కానీ నా మనసంతా భయంతో వణికిపోతోంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి జర్నీ పడదు; బస్సో ఆటోనో ఎక్కితే విపరీతమైన వాంతులు.

అనుకున్నట్లే ఆటో ఎక్కాం. 5 కిలోమీటర్లు దాటగానే అల్లపాడు, ఇంకో 10 కిలోమీటర్లు దాటగానే మేడ్తూరు వచ్చాయి. దారిలో మల్లన్న స్వామి గుడి, వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం చూస్తూ కొత్త లోకాన్ని ఆస్వాదిస్తున్న సమయంలోనే నా కడుపులో తిప్పడం మొదలైంది. అసలైన వాంతుల పర్వం స్టార్ట్ అయింది. నా బాధ చూడలేక నాన్న పక్కనే కూర్చుని నిమ్మకాయ వాసన చూపించడం, తల నిమరడం చేస్తూ తపనపడిపోయారు.

 

మొదటిసారి చూసిన మహానగరం.. నాగార్జున 50 డేస్ పోస్టర్లు!

అలా ప్రయాణిస్తూ ‘కొట్కూరు’ చేరాం. ఆ ఊరిని చూడగానే నా కళ్లు బైర్లు కమ్మాయి. అంత పెద్ద సెంటర్, అంతమంది జనాలు, గుర్రపు బండ్లు, ఎటు చూసినా రూపాయి ఫోన్ బాక్సులు.. ఇవన్నీ నేను జీవితంలో మొదటిసారి చూశాను. అప్పట్లో ఇప్పుడున్నన్ని బైకులు, ఆటోలు ఉండేవి కావు; ఎటు చూసినా టకటకమంటూ తిరిగే గుర్రపు బండ్లే! ఏదో పెద్ద ఫారెన్ సిటీకి వచ్చిన అనుభూతి కలిగింది. అన్నింటికంటే నన్ను కట్టిపడేసింది మాత్రం సినిమా పోస్టర్లు. ఏ గోడ చూసినా, ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా ‘నేనున్నాను’ నాగార్జున గారి భారీ కటౌట్లు, 50 డేస్ పోస్టర్లే. ఆ రంగురంగుల పోస్టర్లను రెప్పవాల్చకుండా ఎంతసేపైనా చూస్తూ ఉండిపోవాలనిపించేది.

 

ఎగ్జామ్ ఫెయిల్.. జ్ఞాపకాలు మాత్రం పాస్!

ఎట్టకేలకు వాంతులు చేసుకుంటూనే ఉదయం 10:30 గంటల ప్రాంతంలో బెల్గల్ చేరుకున్నాం. ఆ ఊరు చుట్టూ పెద్ద కొండలు, దట్టమైన అడవిలా ఉండి చూడటానికి ఎంతో వింతగా అనిపించింది. నాన్న వెంటనే నన్ను ఓ హోటల్కు తీసుకెళ్లి, కడుపు శాంతించడానికి నిమ్మకాయ సోడా తాగించి, నాతో పాటు వచ్చిన నా స్నేహితులందరికీ కడుపునిండా టిఫిన్ ఇప్పించారు. ఆ సమయంలో నాన్న చూపించిన ప్రేమ, ఆప్యాయత నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.

ఆ తర్వాత అందరితో కలిసి ఎగ్జామ్ అయితే రాశాను. తీరా రిజల్ట్స్ వచ్చాక.. గురుకుల ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానులేండి, అది వేరే సంగతి! కానీ ఆ రోజు నాన్నతో కలిసి చేసిన మొదటి సుదీర్ఘ ప్రయాణం, రోడ్డు పక్కన చూసిన గుర్రపు బండ్లు, విపరీతంగా తిప్పిన వాంతులు, ఊరంతా కనిపించిన సినిమా పోస్టర్లు.. ఇవన్నీ నా గుండెల్లో ఒక మధురమైన చిత్రపటంలా శాశ్వతంగా ముద్రించుకుపోయాయి. ఇవాళ రోడ్డుపై సర్కస్ మైకులో ఆ పాట వినగానే.. ఆ జ్ఞాపకాలన్నీ కళ్లముందు కదలాడి, పెదవులపై ఒక స్వచ్ఛమైన చిరునవ్వు మెరిసింది! ఏంటో చిన్ననాటి బాల్య స్మృతుల గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలనిపిస్తుంది. ఈరోజుకి ఇంతే సంగతులు!

-రైటర్ ఎం.కె

MK News Telugu kaburlu ad

Leave a Reply