నా జ్ఞాపకాలు: మా “దసరా” వేరు..

దసరా పండుగ జ్ఞాపకాలు మరియు చిన్ననాటి గ్రామీణ అనుభవాలు

చిన్ననాటి దసరా పండుగ జ్ఞాపకాలు, పల్లెటూరి ఆటలు మరియు జమ్మి పూజ నాటి ఆప్యాయతలు.

కాలం చక్రంలా తిరుగుతూనే ఉంటుంది. ఋతువులు మారినట్లే పండుగలూ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కొన్ని పండుగలు తెచ్చే జ్ఞాపకాలు మాత్రం గుండె గదిలో పదిలంగా నిలిచిపోతాయి. ఇప్పుడు దసరా వస్తే క్యాలెండర్‌లో ఏదో ఒక రెడ్ మార్క్ చూసుకుని, నాలుగు గోడల మధ్య టీవీ రిమోట్ నొక్కుతూ కాలక్షేపం చేస్తున్నాం కానీ.. ఒకప్పుడు మన చిన్నతనంలో దసరా అంటే అదో అద్భుతమైన లోకం. అసలు ఆ రోజుల్లోని దసరా పండుగ జ్ఞాపకాలు తలుచుకుంటేనే ఇప్పటికీ మనసు ఎక్కడలేని ఉల్లాసంతో గంతులు వేస్తుంది. నాటి ఆప్యాయతలు, ఆ సెలవుల సందడి, ఆ అమాయకపు ఆటలు మాటల్లో వర్ణించలేనివి.

నిజానికి సంవత్సరంలో ఎన్ని పండుగలు వచ్చినా, చిన్నప్పుడు మాకైతే దసరా తెచ్చే కిక్కే వేరు. దసరా పండుగకు మాత్రమే ఏకంగా 12 రోజుల పాటు సెలవులు వచ్చేవి. వేసవి సెలవుల్లా కాదు, ఇవి వేరు. స్కూల్ లో చివరి గంట కొట్టగానే, టీచర్ “రేపటి నుండి దసరా సెలవులు” అని చెప్పగానే క్లాస్ మొత్తం ఒక్కసారిగా చేసే అరుపులు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. “12 రోజులు సెలవులోచ్!” అంటూ బ్యాగులు భుజాన వేసుకొని ఇంటికి పరుగెత్తే వాళ్ళం. బడి బరువులు, హోంవర్కుల బాధలు పక్కనపెట్టి స్వేచ్ఛగా గాల్లో ఎగిరే పిట్టల్లా మారిపోయే ఆ మధుర క్షణాలను నెమరువేసుకుంటూ, మనసును తాకే మరిన్ని జీవన స్పందనల కోసం MK News Telugu కబుర్ల విభాగాన్ని వీక్షించండి.

 

12 రోజుల సెలవులు.. పల్లె పొలిమేరల్లో చిల్లంగోడి ఆటలు

బడికి సెలవులు ప్రకటించిన మరుక్షణం నుంచే అసలైన సందడి మొదలయ్యేది. పొద్దున్నే అమ్మ లేపకముందే లేచి, బయట ఫ్రెండ్స్ కేక వేయగానే చెంబుతో మొహం కడుక్కొని పరిగెత్తేవాళ్ళం. అన్నం తిన్నావా అని అమ్మ అడిగితే వినిపించుకోకుండా వెళ్ళిపోయేవాళ్ళం. మా ఆటలు కూడా ఇప్పటి పిల్లల PUBG లాంటివి కావు. మావి మట్టిలో పుట్టిన ఆటలు. చింతపిక్కల ఆట, పత్తాలాట, ఇంకా మా సైడ్ ఫేమస్ – చిల్లంగోడి. రాయలసీమ సైడ్ చాలా ఫేమస్ ఇది. కొన్ని చోట్ల గిల్లీ-దండా అంటారు, కొన్ని చోట్ల బిల్లంగోడు అంటారు. మా ఊర్లో మాత్రం చిల్లంగోడి. దీన్నే ఇప్పటి అప్డేటెడ్ వెర్షన్ లో క్రికెట్ అని చెప్పుకోవచ్చు. రెండు కర్ర ముక్కలు, ఒక చిన్న గుంత, అంతే. దాని కోసం చాలా దూరం, పొలాల్లోకి వెళ్లేవాళ్ళం. పొద్దున్న 8 గంటలకు మొదలుపెడితే మధ్యాహ్నం 12 అయ్యేదాకా ఆటే. కడుపులో ఆకలి వేస్తేనే ఇల్లు గుర్తుకు వచ్చేది. ఇంటికి వచ్చేసరికి అమ్మ వాకిట్లోనే కర్ర పట్టుకొని ఎదురుచూసేది. “అన్నం తినకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? ఒళ్ళు ఎలా కమిలిపోయిందో చూడు” అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, అవసరమైతే రెండు దెబ్బలు కూడా వేసేది. అయినా ఆ తిట్లలో కూడా ఒక ప్రేమ ఉండేది. అన్నం గబగబా తిని, చేయి కడుక్కోగానే మళ్ళీ పరుగు. ఈసారి పత్తాలాట.

వస్తూ వస్తూ దారిలో పొలం గట్ల మీద ఉండే కలిపండ్లు, బల్సపండ్లు జేబు నిండా నింపుకొని వచ్చేవాళ్ళం. ఎర్రగా, నల్లగా ఉండే ఆ చిన్న చిన్న పండ్ల రుచి ఇప్పటి ఏ స్వీట్ షాప్ లోనూ దొరకదు. వాటిని తింటూ, ఒకడి మీద ఒకడు జోకులు వేసుకుంటూ నడిచే ఆ దారి… అబ్బో, ఆ ఎంజాయ్మెంటే వేరు. టైం ఎలా గడిచిపోయేదో కూడా తెలిసేది కాదు.

దసరా వస్తుందనగా మూడు రోజుల ముందు నుండే హడావిడి రెట్టింపయ్యేది. అది బట్టల హడావిడి. అమ్మ, నాన్నలను బతిమాలి, “ఫ్రెండ్ వాళ్ళు ఈ సారి కొత్త మోడల్ తీసుకున్నారట” అని ఏదో ఒక కథ చెప్పి షాపుకు తీసుకెళ్లేవాళ్ళం. ఆ షాపులో గుట్టలుగా పడి ఉన్న బట్టల్లో నుండి మనకు నచ్చిన ఒక చొక్కా వెతికి పట్టుకోవడంలో ఉండే కిక్ వేరు. దాన్ని తీసుకొని ఇంటికి వచ్చాక ఎవరికీ చూపించకుండా దాచిపెట్టేవాళ్ళం. దసరా రోజునే వేసుకోవాలని. 

 

ఇక దసరా రోజు సెలబ్రేషన్ అయితే నెక్స్ట్ లెవెల్.

అందరికంటే ముందు పొద్దున్నే లేచేవాళ్ళం. లేవగానే పూర్ణం గిన్నె పట్టుకొని రుబ్బురోలు కాడికి వెళ్లే వాళ్ళం. ఆ రోలు దగ్గర చూస్తే పెద్ద క్యూ ఉండేది. ఇద్దరు మగవాళ్ళు రోలు తిప్పుతూ ఉంటే.. ఆడోళ్ళు పూర్ణం తోసేవాళ్ళు.. మేం పిల్లలమంతా అందులో నుంచి కొంచెం కొంచెం తీసుకుంటూ తింటూ ఉంటే అబ్బో ఆ మజానే వేరు.

రోలు దగ్గర రుబ్బిన తాజా పూర్ణం ఇంటికి రాగానే పొయ్యి మీద పొగలు కక్కే భక్షాలు సిద్ధమయ్యేవి. ఆ వేడి వేడి బచ్చాల మీద కాస్త నెయ్యి వేసుకొని, పక్కన ఆలుగడ్డ కర్రీ పెట్టుకొని తింటుంటే… అబ్బా! అది రుచి కాదు, స్వర్గం. ఆ వేడికి నెయ్యి కరిగి బచ్చంలోకి ఇంకిపోతుంటే వచ్చే వాసన ఇప్పటికీ నా ముక్కుకు తగులుతూనే ఉంది. తిన్న వెంటనే గబగబా స్నానం చేసి, దాచిపెట్టుకున్న కొత్త బట్టలు వేసుకునేవాళ్ళం. అద్దంలో మనల్ని మనం పదిసార్లు చూసుకుని, జుట్టు దువ్వుకుని, నేరుగా ఫ్రెండ్స్ దగ్గరికి పరుగు. “నా బట్టలు ఎలా ఉన్నాయి?” అని ఒకరినొకరు అడిగేవాళ్ళం. ఒకరి బట్టలు ఒకరు పొగుడుకుంటూ ఊరంతా తిరిగేవాళ్ళం. ఆ చిన్న చిన్న మాటల్లో, ఆ చిరునవ్వుల్లో ఉండే ఆనందం ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి కొన్న బట్టల్లో కూడా రావడం లేదు.

ఇక మధ్యాహ్నం 12 గంటలు అయితేనే అందరం టీవీల ముందు వాలిపోయే వాళ్ళం. ఎందుకంటే ప్రతి దసరాకు టీవీలో “నర్తనశాల” సినిమా కన్ఫర్మ్ గా వేసేవారు. ఆ క్లాసిక్ మూవీ చూస్తూ టైం గడిచిపోయేదో కూడా తెలియదు. సాయంత్రం అయితే అసలైన పండగ. ఊరంతా కొత్త బట్టలు వేసుకొని జమ్మి చెట్టు దగ్గరికి బయలుదేరేది. అది ఊరేగింపులా ఉండేది, తిరునాళ్ళలా ఉండేది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి, జమ్మి ఆకును తెచ్చుకునేవారు. జేబు నిండా జమ్మి ఆకును నింపుకొని ఇంటికి తిరిగి వచ్చి, ఇంట్లో పెద్దవాళ్ళ కాళ్ళకు మొక్కి, వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేవాళ్ళం. ఆ ఆకును వాళ్ళు తల మీద పెట్టి “బంగారంలా ఉండాలి” అని దీవించే ఆ మాట ఇప్పటికీ గుర్తుంది.

రాత్రి 9 గంటలకు ఇక మళ్ళీ సందడి. చుట్టాలు, బంధువులు అందరూ ఒకే ఇంట్లో చేరేవారు. వండిన పిండి వంటకాలన్నీ మధ్యలో పెట్టుకొని అందరూ కలిసి కట్టుగా భోజనం చేసేవాళ్ళం. తిన్న తర్వాత 9 నుండి 12 వరకు కబుర్లు. ఆ కబుర్లలో పాత రోజులు, పొలం పనులు, పెళ్లి సంబంధాలు… అబ్బో ఇలా ఎన్నెన్ని మాట్లాడుకునేవారో! అసలు టైం ఎలా గడిచిపోయేదో తెలిసేదే కాదు. మరుసటి రోజు అయితే ఇంకో పండగ – కర్రీ పండగ. ప్రతి ఇంట్లో నాన్-వెజ్. మటన్ కూర వాసనతో ఊరంతా ఘుమఘుమలాడేది. తిన్న తర్వాత మళ్ళీ టీవీ ముందు కూర్చొని కొత్త సినిమాలు చూస్తూ ఆ రోజు కూడా గడిపేసేవాళ్ళం.

అప్పటి పండుగల్లో ఆడంబరాలు లేవు, సోషల్ మీడియా లైకులు లేవు.. కేవలం స్వచ్ఛమైన ప్రేమానురాగాలు, ఒకరినొకరు కలుపుకుపోయే ఆప్యాయతలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు తలుచుకుంటే అప్పటి ఆప్యాయతలు, పలకరింపులు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్లు. ఎవరి ఇంట్లో వాళ్ళు, ఎవరి ఫోన్ లో వాళ్ళు. పండగ రోజు కూడా ఇంట్లో అందరూ ఒకే గదిలో ఉన్నా, నలుగురు నాలుగు మూలల్లో ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. పండగే పండగలా అనిపించడం లేదు.

ఏం చేస్తాం? రోజులు మారాయి. మనుషులు మారారు. పండగల అర్థాలు మారాయి.

కానీ అప్పుడు ఉండే ఆ సెలబ్రేషన్స్ మళ్ళీ వస్తాయా? రావు. కానీ వాటి జ్ఞాపకాలు మాత్రం మదిలో అలాగే ముద్ర వేసుకున్నాయి. ఆ కలిపండ్ల రుచి, ఆ కొత్త బట్టల కిక్, ఆ జమ్మి ఆకు పరిమళం, అమ్మ తిట్లలోని ప్రేమ, నాన్న ఇచ్చిన బట్టల్లోని గర్వం – ఇవన్నీ నా గుండెలోనే ఉండిపోతాయి. ఈ దసరాకు మళ్ళీ ఆ రోజులు రావు అని తెలిసినా, ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఎందుకంటే మనం బతికేది టెక్నాలజీ యుగంలోనైనా, మనల్ని బతికించేది ఆ అందమైన జ్ఞాపకాలే కదా! సరేలెండి ఇలా చెప్పుకుంటూ పోతే టైం చాలదు. 

మీకు మీ కుటుంబ సభ్యులకు, మన కబుర్లు వీక్షకులకు, ఎం. కె న్యూస్ ఫ్యామిలీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు..

         – రైటర్ ఎం. కె

 

Leave a Reply