YS JAGAN: వ్యూహాలకు బ్రేకులు.. సాయి రెడ్డి ప్లానేంటి!

విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy) వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఆయన విషయంలో వైయస్ జగన్ (ys jagan) వైఖరి ఎలా ఉండబోతుందో అనేది ఆసక్తికరం.

1000057172
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరిగి పూర్వవైభవం సాధించడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress party ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలన్న దృఢ సంకల్పంతో ఆయన క్షేత్రస్థాయి సమీక్షలు, రీజినల్ కోఆర్డినేటర్లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పార్టీ యంత్రాంగాన్ని యుద్ధప్రాతిపదికన ఎన్నికలకు సిద్ధం చేస్తున్న వేళ.. గతంలో పార్టీలో చక్రం తిప్పిన మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy ) వ్యవహారం వైసిపికి ఊహించని తలనొప్పిగా మారింది. 

 

 నంబర్-2 స్థానంపై అసంతృప్తి!

వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటి నిలిచిన విజయసాయిరెడ్డి ఒకప్పుడు వైసీపీలో తిరుగులేని ‘నంబర్-2’ నాయకుడిగా కొనసాగారు. అయితే, ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ నిర్ణయాలపై ఎందుకు విరక్తి చెందారో కుండబద్దలు కొట్టారాయన.

తనను కేవలం ఉత్తరాంధ్రకే పరిమితం చేస్తూ కోఆర్డినేటర్ బాధ్యతలు ఇవ్వడం, అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని మొత్తం రాష్ట్ర సమన్వయకర్తగా నియమించడం తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని వాపోయారు.పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన తనకంటే సజ్జలకే అధినేత అధిక ప్రాధాన్యత ఇవ్వడం తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని పరోక్షంగా స్పష్టం చేశారు.

 

 జవహర్ రెడ్డికి పెరిగిన ప్రాధాన్యత?

విజయసాయిరెడ్డి కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలకే కాకుండా, గత ప్రభుత్వ హయాంలో ఢిల్లీ స్థాయిలో కేంద్ర పెద్దలతో సంబంధాలను నెరపడంలోనూ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు ఖరారు చేయడంలోనూ కీలక పాత్ర పోషించేవారు. అయితే, తర్వాతి రోజుల్లో ఆ ఢిల్లీ వ్యవహారాల నుంచి తనను తప్పించి, అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (CS) కేఎస్ జవహర్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

నాడు రఘురామకృష్ణంరాజు.. నేడు విజయసాయిరెడ్డి?

గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు (RRR) సొంత పార్టీపైనే ప్రతిరోజూ “రచ్చబండ” పేరిట నిప్పులు చెరుగుతూ ప్రజల్లో వ్యతిరేకతను పెంచడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు అదే తరహాలో పార్టీ మూలాలు, అంతర్గత రహస్యాలు తెలిసిన విజయసాయిరెడ్డి కూడా ఒక్కొక్కటిగా బహిర్గతం చేయడం వైసీపీ క్యాడర్ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. గతంలో రఘురామ బయటినుంచి విమర్శలు చేస్తే, జగన్తో దశాబ్దాల అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి వంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా మరింత ఎక్కువ నష్టాన్ని చేకూర్చే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

జగన్ ఎన్నికల రోడ్మ్యాప్కు ఇది ఎదురుదెబ్బేనా?

ప్రస్తుతం వైఎస్ జగన్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి బలోపేతంపై దృష్టి సారించిన సమయంలో.. పార్టీలోని పాత తప్పులను, అంతర్గత కుమ్ములాటలను స్వయంగా మాజీ నేతలే మీడియా ముందుకు తేవడం పార్టీ ఇమేజ్ను దెబ్బతీసే అంశమే. ప్రత్యర్థులైన కూటమి పార్టీలకు ఇది ప్రధాన అస్త్రంగా మారుతోంది. ఈ అంతర్గత వివాదాలు కార్యకర్తల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయకుండా జగన్ ఎలాంటి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడతారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.

Leave a Reply