నా మాటల్లో..: ‘ఉచిత బస్సు’ కాదు ‘ఉచిత భారం’!

1000055160
Kurnool Bus Stand Heavy Rush Free Bus Scheme Common Man Personal Experience

 నమస్కారమండి అందరికీ..

గత నెల రోజులుగా అనారోగ్య సమస్యల కారణంగా నేను ఇంటికే పరిమితమయ్యాను, ఎక్కడికీ బయటకు వెళ్లలేదు. చికిత్స కోసం మా గ్రామం నుంచి కర్నూలు నగరంలోని ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. నిజానికి నేను బైక్ మీదే వెళ్లాను. కానీ డాక్టర్ ట్రీట్మెంట్ పూర్తయ్యాక నా నీరసాన్ని గమనించిన మా నాన్న, మా అన్నయ్య నన్ను కన్విన్స్ చేశారు.. “ఒంట్లో బాగోలేదు కదా, బైక్ మీద ఇంత దూరం జర్నీ చేయడం సేఫ్టీ కాదు.. బస్సులో వెళ్లిపో” అని. వారి మాట విని కర్నూలు బస్టాండ్కు చేరుకున్నాను. కానీ అక్కడ నాకు ఎదురైన అనుభవం చూశాక.. శారీరక బాధ కంటే మానసిక వేదనే ఎక్కువైంది.

బస్టాండ్లో ఊహించని రద్దీ.. ఏమైంది కర్నూలుకు?

నేను వెళ్ళింది వీకెండ్ (శని, ఆదివారాలు) కాదు.. ఒక సాధారణ గురువారం! మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయం. బస్టాండ్లో అడుగుపెట్టగానే నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. గతంలో నేనెప్పుడూ కర్నూలు బస్టాండ్లో అంత విపరీతమైన రద్దీ చూడలేదు. ఏవైనా పండగలా? జాతర్లా? లేక ఏమైనా స్పెషల్ రోజా అంటే అదీ కాదు. ప్లాట్ఫామ్పైకి ఏ బస్సు వస్తున్నా, రాబోతున్నా.. క్షణాల వ్యవధిలోనే కిటకిటలాడిపోతోంది. వచ్చిన ప్రతి బస్సు నిమిషాల్లో ఫుల్ అయి వెళ్ళిపోతోంది. అసలు ఎందుకు ఇంత రద్దీ అని నిశితంగా గమనిస్తే అక్కడ నాకు ఒక చేదు నిజం కనిపించింది.

బస్సుల్లో 80% మహిళలే.. మరి పురుషుల పరిస్థితేంటి?

ప్రతి బస్సులోనూ దాదాపు 80 శాతానికి పైగా మహిళా ప్రయాణికులే ఉన్నారు. పురుషులకు కనీసం బస్సు లోపలికి అడుగుపెట్టే అవకాశం కూడా దక్కడం లేదు. ఆ సమయంలో బయట చిన్నగా వర్షం కూడా పడుతోంది. నాలాగే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు, రోజంతా కష్టపడి ఇళ్లకు వెళ్లాలనుకునే కూలీలు, చిరుద్యోగులు బస్సుల కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. వారి కళ్లలో కనిపించిన నిస్సహాయత, మానసిక క్షోభ నన్ను తీవ్రంగా కలచివేసింది. ఒకవేళ నెట్టుకుని బస్సు ఎక్కినా నిలబడే వెళ్లాలి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే.. బస్సు ఫుట్బోర్డులపై కూడా మహిళలే నిలబడి ప్రయాణిస్తున్నారు. ఆ సిచువేషన్ చూసి నా కాలేజీ డేస్ గుర్తొచ్చాయి. కాలేజ్ రోజుల్లో మేం కుర్రాళ్లం కూడా ఫుట్బోర్డులపై వేలాడుతూ వెళ్లేవాళ్లం. కానీ అక్కడ 30 నుంచి 40 ఏళ్ల వయసున్న మహిళలు ఫుట్బోర్డులపై ప్రాణాలకు తెగించి నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యమేసింది.

3 గంటలు నిరీక్షణ.. 10% సీట్లు కూడా దక్కవా?

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. దాదాపు 3 గంటల పాటు అక్కడే వేచి చూశాను. వచ్చిన ప్రతి బస్సు మహిళలతోనే నిండిపోయింది. కనీసం పురుషులకు 10 శాతం సీట్లు కూడా లభించని దుస్థితి. టికెట్ డబ్బులు పూర్తిగా చెల్లించి ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్న పురుషులకు సైతం బస్సు ఎక్కే హక్కు లేకుండా పోయింది.

ఇది మహిళా సాధికారతా? లేక ఓట్ల వేటా?

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మంచి విషయమే కావచ్చు. కానీ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, అదనపు బస్సులు నడపకుండా ఇలాంటి పథకాలు అమలు చేస్తే సామాన్య పౌరులు పడే పాట్లు వర్ణనాతీతం. ఉచిత బస్సు ప్రవేశపెట్టడం వల్ల ప్రభుత్వానికి ఎంత లాభమో తెలియదు కానీ, గ్రౌండ్ లెవల్లో సామాన్యులకు తీవ్రమైన ఇబ్బందులు తప్పడం లేదు. పురుషులు కూడా సమాజంలో భాగమే కదా? వారి ప్రయాణ అవసరాలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇది కేవలం ఓట్ల కోసం తెచ్చిన పద్ధతా.. లేక నిజంగా వ్యవస్థను బాగుచేయడానికా? అనేది పాలకులకే తెలియాలి.

-జర్నలిస్ట్ ఎం.కె

Leave a Reply