నా అనుభవాలు: సాయం కాటు వేస్తే..!

ఈరోజు ఎందుకో మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలనిపించింది. నిజానికి ఇది నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. మంచితనం అనేది అన్ని సందర్భంలో మనకు మంచి చేయదు. కొన్ని సందర్భంలో గుణపాఠం కూడా నేర్పిస్తూ ఉంటుంది. అలాంటి గుణపటాలు నా జీవితంలో చాలానే ఉన్నాయనుకోండి అది వేరే విషయం. కానీ రీసెంట్గా జరిగిన ఈ సంఘటన మాత్రం నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది. ఎందుకంటే.. సమాజంలో మన మంచితనాన్ని చూసి అభిమానించే వాళ్ల కంటే, దాన్ని అలుసుగా తీసుకునే వాళ్లే ఎక్కువ అని ఈ ఇన్సిడెంట్ మరోసారి కళ్లకు కట్టింది.
మాదో చిన్న ఫ్యామిలీ. నేను, నా భార్య, మా అమ్మానాన్న.. అలాగే ఒక చెల్లెలు. దేవుడు మాకు ఇచ్చిన వరమో లేక మా ఓపికకు పెట్టిన పరీక్షో తెలీదు కానీ, మా చెల్లెలు నడవలేదు, మాట్లాడలేదు. కంప్లీట్లీ 100% హ్యాండీక్యాప్డ్. పుట్టినప్పటి నుంచి ఆమె బాధ్యతంతా మేమే చూసుకుంటున్నాం. ప్రభుత్వం నుంచి ఆమెకు నెలకు రూ. 6,000 పింఛన్ వస్తుంది. గతంలో అయితే ప్రతి నెలా ఒకటో తారీకు రాగానే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) లేదా వీఆర్ఏ నేరుగా మా ఇంటికే వచ్చి, మా చెల్లెలి వేలిముద్ర వేయించుకుని ఎంతో పద్ధతిగా పెన్షన్ ఇచ్చి వెళ్లేవారు. మాకూ ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. అయితే మొన్నామధ్య ఒక మార్పు వచ్చింది. పెన్షన్ ఇచ్చే విధానంలో వీఆర్వోలతో పాటు సచివాలయ ఉద్యోగులకు కూడా బాధ్యతలు పంచారు. అలా మా ఏరియాకు కొత్తగా ఒక సచివాలయ ఉద్యోగి వచ్చాడు.
ఆ మొదటి నెల ఏమైందంటే.. అప్పటికే ఉద్యోగంలో చేరిన కొత్త కుర్రాడు కదా, అతనికి మా ఏరియా తెలియదు, ఎవరి ఇల్లు ఎక్కడుందో తెలియదు. “పాపం కొత్త అతను.. ఎందుకు ఇబ్బంది పడాలి” అని నా మనసు ఊరుకోలేదు. నా బైక్ వేసుకుని సచివాలయానికి వెళ్లి, అతన్ని ఎక్కించుకుని మా ఇంటికి తీసుకొచ్చాను. మా చెల్లెలితో పెన్షన్ ఇప్పించాను. అక్కడితో ఆగిపోయి ఉంటే కథ వేరేలా ఉండేదేమో. కానీ ఆ లిస్ట్‌లో ఉన్న మిగతా పేర్లను చూసి, “అయ్యో పాపం, ఎండలో ఎక్కడెక్కడ వెతుక్కుంటాడు” అనుకుని.. ఆ రోజంతా నా పనులన్నీ పక్కనబెట్టి, నా బైక్‌పైనే ఆ ఏరియాలోని అందరి ఇళ్లకూ అతన్ని నేనే స్వయంగా తీసుకెళ్లాను. మధ్యలో అతని మొబైల్ పనిచేయకపోతే నా ఫోన్ ఇచ్చి మరీ ఆన్లైన్ ఎంట్రీలు చేయించాను. అలా ఆ మండుటెండలో రోజంతా అతనితోనే ఉండి, పని పూర్తయ్యాక మళ్లీ సచివాలయం దగ్గర దింపి.. ఒక మంచి పని చేశానన్న సంతృప్తితో ఇంటికి వచ్చేశాను.
ఇంతవరకు బాగానే ఉంది కదా? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది!
ఒక నెల గడిచిపోయింది. రెండో నెల ఒకటో తారీకు రానే వచ్చింది. సరే, గత నెలలోనే అతనికి అన్ని ఇళ్లు చూపించాను కదా, ఊరు అలవాటై ఉంటుందిలే అని నేను అతన్ని పిలవలేదు. ఆ రోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉండి పక్క ఊరికి వెళ్లాను. మా ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్లందరికీ ఆ ఉద్యోగి వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్లిపోయాడు. మా ఇంట్లో వాళ్లు “మా ఇంటికి కూడా వస్తాడులే” అని గుమ్మం వైపే చూస్తూ కూర్చున్నారు. కానీ అతను రాలేదు. సరే మధ్యాహ్నం వస్తాడేమో, సాయంత్రం వస్తాడేమో అనుకుంటే ఆ రోజంతా రాలేదు. పోనీలే అని రెండో తారీకు చూశారు.. అప్పటికీ రాలేదు!
ఇక ఇంట్లో మా నాన్నకు ఓపిక నశించి, మూడో రోజు నేరుగా సచివాలయానికే వెళ్లారు. వెళ్లి ఆ ఉద్యోగిని, “ఏమయ్యా.. చుట్టుపక్కల వాళ్లందరికీ పెన్షన్ ఇచ్చావు కదా, కనీసం నడవలేని ఆ అమ్మాయి కోసం మా ఇంటికి ఎందుకు రాలేదు?” అని నిలదీశారు.
అప్పుడు ఆ ఉద్యోగి చెప్పిన మాట విని మా నాన్న నోట మాట రాలేదంటే నమ్మండి!
అతను ఏమన్నాడో తెలుసా?
“మీ అబ్బాయి వచ్చి నన్ను బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్తాడు కదా.. అందుకే నేను రాలేదు!” అని ఎంత ఈజీగా చెప్పేశాడో!
ఒక్క క్షణం ఆలోచించండి.. ఆ మాట విన్నప్పుడు మా నాన్నకు ఎంత రక్తం మరిగిపోయి ఉంటుందో! ఒకవైపు కోపం, మరోవైపు నవ్వాలో ఏడవాలో అర్థం కాని విచిత్రమైన పరిస్థితి. గత నెలలో మానవతా దృక్పథంతో నేను చేసిన సాయాన్ని.. అతను తన “హక్కు”గా మార్చేసుకున్నాడు! ఇంటింటికీ తిరిగి సర్వీస్ ఇవ్వాల్సిన ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సామాన్య పౌరుడు వచ్చి తనను బైక్ మీద ఊరేగిస్తూ తీసుకెళ్లాలని ఎదురుచూడటం ఎంతవరకు న్యాయం? మా నాన్నకు కాస్త చట్టాలు, లోకజ్ఞానం ఉన్నాయి కాబట్టి.. “ఇదేనా నీ బాధ్యత? నీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తా” అని గట్టిగా హెచ్చరించేసరికి, భయపడి వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చి పెన్షన్ ఇచ్చాడు.
నేను ఊరి నుంచి తిరిగొచ్చాక నాన్న ఈ విషయం నాతో చెప్పారు మా నాన్న. నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. అస్సలు తట్టుకోలేకపోయాను. ఒక కొత్త వ్యక్తి అని జాలిపడి, బైక్ పెట్రోల్ తగలేసి, నా సమయాన్ని వెచ్చించి, నా మొబైల్ ఇచ్చి సాయం చేస్తే.. నేను ఏదో అతని కింద పని చేసే వ్యక్తులా చూడటం.. నాకు కోపం కట్టలు తెంచుకునేలా చేసింది.
వెంటనే సచివాలయానికి వెళ్లి అతన్ని నేరుగా నిలదీశాను. “ఏంటయ్యా నీ పద్ధతి? ఒక జర్నలిస్టుగా నీ ఉద్యోగం గురించి, నీ బాధ్యతారాహిత్య ప్రవర్తన గురించి అధికారులకు ఫిర్యాదు చేసే హక్కు నాకుంది. పోనీలే పాపం అని సాయం చేస్తే దాన్ని అలుసుగా తీసుకుంటావా?” అని నిలదీసి కడిగిపారేశాను. దాంతో అతను ఒక్కసారిగా బిత్తరపోయి.. “సార్.. చాలా పెద్ద తప్పయిపోయింది. మీరే వస్తారనుకున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు, దయచేసి క్షమించండి” అని చేతులెత్తి వేడుకున్నాడు.
ఈ సంఘటన జరిగినప్పటి నుంచి నా మనసులో ఒకటే ప్రశ్న తొలుస్తోంది..
ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలతోనే సేవలు చేయించుకోవడానికి ఇలా అలవాటు పడిపోతున్నారా?
మనం అవతలివాడి కష్టాన్ని చూసి జాలితో ఒక అడుగు ముందుకేసి సాయం చేస్తే.. ఎదుటివాడు మనల్నే బానిసల్లా చూడటానికి సిద్ధపడుతున్నాడు. ఇలాంటి ప్రవర్తనల వల్లే కదా సమాజంలో నిజంగా సాయం చేయాలనే మంచి మనసున్న వాళ్లు కూడా వెనకడుగు వేస్తున్నారు?
సాయం చేయడంలో తప్పులేదు కానీ.. మన మంచితనం ఎదుటివాడికి సోమరితనాన్ని, పొగరును పెంచేదిగా ఎప్పుడూ మారకూడదు. ఇలాంటి సంఘటనలు నా జీవితంలో చాలానే ఉన్నాయి లెండి.. మెల్లగా ఒక్కోటి మాట్లాడుకుందాం! ఈరోజుకి ఇంతే!
