నా జ్ఞాపకాలు: అన్నం కోసం.. పరుగులు!

స్కూల్ గ్రౌండ్లో ఒక బుడ్డోడు లీడర్లా అందరు పిల్లలను కంట్రోల్ చేస్తూ, క్యూ లైన్ వేయిస్తున్నాడు. బహుశా వాడు స్కూల్ లీడరేమో. వాన్ని చూడగానే నన్ను నేను చూసుకున్నట్లయింది ఎందుకంటే నేను కూడా నా చిన్నతనంలో స్కూల్ లీడరే. పిల్లలంతా చేతుల్లో స్టీల్ ప్లేట్లు పట్టుకుని, అన్నం పెట్టే ఆయా దగ్గర క్రమశిక్షణగా వరుసలో నిలబడి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే నా కళ్లముందు నా చిన్ననాటి రోజులు మెదిలాయి. ఒకప్పుడు నేనూ ఆ చేతుల్లో ప్లేట్ పట్టుకుని, అన్నం కోసం ఎగిరెగిరి పడుతూ అదే వరుసలో నిలబడేవాడిని కదా అని గుర్తురాగానే తెలియకుండానే నా పెదవులపై ఒక స్వచ్ఛమైన చిరునవ్వు విచ్చుకుంది.
నెలనెలా రెండు పళ్ల బియ్యం సంచుల హడావిడి:
అప్పట్లో నేను మూడో తరగతి చదువుతున్న రోజులు. అప్పటికి స్కూళ్లలో ఇంకా మధ్యాహ్న భోజన పథకం మొదలుకాలేదు. దానికి బదులుగా ప్రభుత్వం నెలకోసారి విద్యార్థులకు హాజరును బట్టి ‘రెండు పళ్ల బియ్యం’ (బియ్యం కొలత పద్దతి) ఇచ్చేది. “రేపు బడిలో బియ్యం పోస్తారంట” అనే వార్త రాగానే పిల్లాజెల్లా అందరికీ ఒకటే సంబరం. స్కూల్ నుంచి పరుగుపరుగున ఇంటికి వెళ్లి అమ్మ దగ్గర సంచి లాక్కొని రావడం, సార్ల ముందర బస్తా చుట్టూ చేరి బియ్యం పెట్టించుకోవడం ఆ రోజుల్లో మాకు అదో పెద్ద సెలబ్రేషన్!
బడిలో మధ్యాహ్నం భోజనం.. ఊరంతా పండగ వాతావరణం!
సరిగ్గా మూడో తరగతిలోనే అనుకుంటా.. ప్రభుత్వం బడిలోనే వేడివేడిగా ‘మధ్యాహ్న భోజనం’ పెట్టబోతోందన్న ప్రకటన వచ్చింది. ఆ వార్త వినగానే ఊరంతా ఏదో పెళ్లి సందడి మొదలైనంత హంగామా కనిపించింది. ఇంటికి వెళ్లి అమ్మనాన్నలకు “అమ్మా.. రేపటి నుంచి మాకు బడిలోనే అన్నం పెడతారంట!” అని చెబితే, వాళ్లు కూడా ఏదో పెద్ద శుభకార్యానికి వెళ్లినంత మురిసిపోయేవారు.
తొలిసారి స్కూల్లో అన్నం వండి వడ్డించిన రోజు.. మా పేరెంట్స్ కూడా బడికి వచ్చి, అన్నం ఎలా ఉంది? సాంబారు, పప్పు కూర ఎలా చేశారని స్వయంగా రుచి చూసి ఎంత ఆనందించారో మాటల్లో చెప్పలేను. పిల్లలందరూ ఒకే దగ్గర కూర్చుని తింటుంటే చూసే పెద్దల కడుపు నిండిపోయేలా ఉండేది ఆ వాతావరణం.
ప్లేట్ల కోసం పరుగుల పందెం:
అప్పట్లో ఇప్పుడున్నట్టుగా బ్యాగుల్లో క్యారేజీ బాక్సులు, ప్లేట్లు పెట్టుకుని వెళ్లేవాళ్లం కాదు. మధ్యాహ్నం 12:30 గంటలకు బెల్ కొట్టగానే.. ప్లేట్ తెచ్చుకోవడానికి అందరం ఒకేసారి ఇంటికి ఉరుకులు పరుగులు! మళ్లీ అన్నం తిన్నాక, ఆ ప్లేట్‌ను ఇంట్లో పడేసి రావడానికి మరో ఉరుకు! అలా భోజనం మొదలైన మొదటి రెండు నెలలు ఆ ప్లేట్ల కోసం పెట్టిన పరుగుల పందెం, ఆ గోల మాటల్లో వర్ణించలేను. అన్నం తినేటప్పుడు ఒకడి ప్లేట్లోకి ఒకడు తొంగిచూడటం, సాంబార్ ఎక్కువ పోయించుకోవడానికి ఆయాల చుట్టూ తిరగడం.. అబ్బో! ఆ రోజులు నిజంగా ఒక అద్భుతం.
కాలం చక్రంలా తిరుగుతూ ఉంటుంది. మనం వయసుతో పాటు ఎదిగిపోతాం, బాధ్యతలు పెరుగుతాయి, తీరికలేని యాంత్రిక జీవితంలో పడిపోతాం. కానీ ఆ చిన్ననాటి స్వచ్ఛమైన అమాయకత్వం, మనుషుల మధ్య ఉన్న కల్మషం లేని ఆప్యాయతలు మాత్రం ఎప్పటికీ తిరిగిరావు. ఈరోజు ఆ చిన్నారి పిల్లలను చూశాక అర్థమైంది.. బాల్యం అనేది మన జీవితంలో ఎప్పటికీ తిరిగిరాని ఒక అందమైన వరమని. ఆ తీపి జ్ఞాపకాలను గుండెల్లో నెమరువేసుకుంటూ ముందుకు సాగిపోవడమే మనం చేయగలిగింది!
-రైటర్ ఎం.కె
