నా మాటల్లో: 30 ఏళ్లు దాటినా.. నాన్న బాటలోనే!

Naa matallo personal experience

అదేంటోగాని!.. నా చుట్టూ ఎంతమంది స్నేహితులున్నా, రోజూ ఎంతోమంది పరిచయస్తులు నవ్వుతూ పలకరిస్తున్నా.. నా ఆలోచనలు ఎందుకో నిత్యం ఒంటరితనంతోనే స్నేహం చేస్తుంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు బాగానే ఉన్నట్లు అనిపించినా, ఏకాంతంలోకి రాగానే ఏదో తెలియని బాధ, ఎవరికి చెప్పలేని బరువు నా గుండెలను కమ్మేస్తుంది. ఏంటో ఈ జీవితం.. పుడతాం, పెరుగుతాం, చదువుకుంటాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాం. తర్వాత బాధ్యతలు పెరిగి, చివరకు ఏదో ఒక ఉద్యోగమో.. పనో.. చేసుకుంటూ బతుకు బండి నెట్టుకొస్తాం. చూస్తూనే అలా అలా 30 ఏళ్ళు వచ్చేస్తాయి. ఏదో ఒక టైం లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఒంటరితనమే నన్ను ప్రశ్నిస్తుంది ” ఇన్నేళ్లలో అమ్మ నాన్న గర్వపడేలా నువ్వేం చేసావని? ” ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం మౌనమే. ఎందుకంటే.. పుట్టినప్పటి నుంచి 30 ఏళ్లు వచ్చాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. మా నాన్న వేసిన దారే తప్ప నాకు ఇంకేం కనిపించదు. ఇప్పటికీ మా నాన్న నీడలోనే తప్ప.. నేను వాళ్లకు నీడనిచ్చింది లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ వయసు 50 ఏళ్ల పైనే. ఇన్నేళ్లు నాకోసం ఎంతో కష్టపడ్డ వాళ్లకు నేను ఇచ్చింది ఏంటి అంటే.. శూన్యం. ఇదే నన్ను నిత్యం తొలిచేస్తూ ఉంటుంది. ఏ జాబ్ చేసిన, ఏ పని చేసినా.. అదేంటో మనసుకు తృప్తిగా మాత్రం అనిపించదు.. ఎందుకో తెలియని వెలతి. ఏదో ఒక క్షణంలో నిశ్శబ్దంగా కూర్చుని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాలో మొదలైన అంతర్మథనం నన్ను నిద్రపోనివ్వదు.

Read also: నా జ్ఞాపకాలు: అన్నం కోసం.. పరుగులు!

 పట్టుదల, స్థిరత్వం లేకపోతే ఏదీ దక్కదు!

ఒంటరిగా కూర్చున్న ప్రతిసారీ నాలో ఇలాంటి ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతుంటాయి. ఎందుకంటే సమాజంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవాలని, ఏదో ఒక రంగంలో తిరుగులేని విజయాన్ని సాధించి నా తల్లిదండ్రులకు గర్వకారణంగా నిలవాలని నాకూ ఎంతో తపన ఉండేది. ఇది చేయాలి, అది సాధించాలి అని బోలెడన్ని ప్రణాళికలు రచిస్తుంటాను. కానీ తీరా ఆచరణలోకి వచ్చేసరికి ఏదీ పూర్తి చేయలేక ఒక రకమైన నిస్సహాయతలో కూరుకుపోతుంటాను. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? ఎక్కడ లోపం జరుగుతోంది? అని నా అంతరంగాన్ని లోతుగా తరచి చూస్తే నాకు ప్రధానంగా రెండు బలమైన కారణాలు కనిపించాయి.

  • కన్సిస్టెన్సీ (నిరంతర సాధన లేకపోవడం): ఎంత గొప్ప ఆలోచన ఉన్నా, ఎంతటి ప్రతిభ ఉన్నా మనం చేసే ప్రయత్నంలో నిలకడ లేకపోతే లక్ష్యం ఎప్పటికీ చేతికందదు. ఏదైనా ఒక పనిని పట్టుదలతో ప్రారంభించినప్పుడు ఆరంభంలో అపజయాలు, అవరోధాలు ఎదురవడం సహజం. కానీ ఆ చిన్నపాటి వైఫల్యాలకే భయపడి ఆగిపోతే ఫలితం ఎప్పటికీ రాదు. నిరంతర సాధన అనేదే విజయతీరాలకు చేర్చే ఏకైక వారధి. ఆ నిలకడ లోపించడం వల్లే ఎంత శ్రమించినా సరైన గుర్తింపు దక్కడం లేదని అర్థమైంది.
  • సమయం విలువ (Value of Time): కాలం ఎవరి కోసమూ ఆగదు. రోజులు గడుస్తాయి, పరిస్థితులు మారుతాయి, తెలియకుండానే వయసు మీదపడుతూ ఉంటుంది. చేయాల్సిన పనిని, చూపించాల్సిన పట్టుదలను సరైన వయసులో ప్రదర్శించలేకపోతే ఇక జీవితంలో కన్న కలలు ఎప్పటికీ నెరవేర్చుకోలేం.

25 ఏళ్ల లోపే పునాది పడాలి.. 30కి వచ్చేసరికి ఫలితం కనిపించాలి!

నా ఈ వ్యక్తిగత అనుభవాలు, నేను పడిన ఆవేదన నుంచి తోటి యువతకు, ఈ వ్యాసం చదువుతున్న మిత్రులందరికీ నేను విన్నవించుకునే ఒకే ఒక్క మాట.. సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేసుకోకండి. మీరు కెరీర్‌లో ఒక ఉన్నత స్థాయికి చేరాలన్నా, మీ కాళ్లపై మీరు నిలబడి ఆర్థికంగా బలపడాలన్నా 25 ఏళ్ల లోపే దానికి సంబంధించిన గట్టి పునాది వేయాలి. ఎందుకంటే 25 ఏళ్ల వరకు మనపై బాధ్యతలు తక్కువ. రిస్క్ తీసుకునే శక్తి, కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం శరీరంలోనూ, మెదడులోనూ పుష్కలంగా ఉంటాయి.

ఒక్కసారి వివాహం జరిగి, ముప్పై ఏళ్ల వయసు మీదపడిన తర్వాత బాధ్యతలు మన ఆలోచనలను శాసిస్తాయి. అప్పుడు రిస్క్ తీసుకునే ధైర్యం క్రమంగా తగ్గుతుంది. 30 ఏళ్ల వయసులో ఒక్కసారి ఆగి వెనక్కి చూసుకున్నప్పుడు మనకంటూ ఒక గుర్తింపు, మనం సాధించిన విజయం స్పష్టంగా కనిపించాలి. అప్పుడే మన కోసం రక్తాన్ని చెమటగా మార్చి, తమ కలలను త్యాగం చేసి మనల్ని పెంచి పెద్ద చేసిన మన అమ్మానాన్నల కష్టానికి, వారు మన కోసం వేసిన దారికి అసలైన గౌరవం, విలువ దక్కుతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం మనల్ని మరింత పరిణతి చెందిన వ్యక్తిగా తీర్చిదిద్దే గుణపాఠమే కావాలి.

నాన్న వేసిన బాటకు నిజమైన గౌరవం ఎప్పుడు దక్కుతుంది?

తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం మనల్ని సరైన దారిలో పెడతారు. కానీ ఆ దారిలో ప్రయాణించాల్సింది మనమే. నాన్న చూపించిన వేలు పట్టుకుని నడవడం ఎంత ముఖ్యమో, ఒకానొక దశకు చేరుకున్నాక.. నాన్న చేయి పట్టుకొని నువ్వు నడిచే దారిలో.. ఆయనకు కొండంత అండగా, ధైర్యంగా నిలవడం కూడా అంతే ముఖ్యం. నీ కొడుకు ఏం చేస్తున్నాడు అని నలుగురు అడిగినప్పుడు ఆయన తల దించుకునేలా కాకుండా, గర్వంగా చెప్పుకునేలా చేయడమే ప్రతి బిడ్డ సాధించాల్సిన అసలైన విజయం.

 నేను చెప్పేది ఒక్కటే.. 30 ఏళ్లలో నేర్పిన ఈ గుణపాఠం నన్ను నిత్యం మేల్కొల్పుతూనే ఉంటుంది. గడిచిపోయిన కాలాన్ని తలచుకుని నిస్సహాయంగా కుంగిపోవడం కంటే, చేతిలో ఉన్న నేటి రోజును సద్వినియోగం చేసుకుని పట్టుదలతో పనిచేయడమే ముఖ్యం. వైఫల్యాలు ఎదురైనా సరే నిరంతర సాధనతో ముందడుగు వేయండి. మనల్ని కంటికి రెప్పలా చూసుకున్న మన తల్లిదండ్రులు, మనల్ని నమ్మి వచ్చిన భార్య.. ముఖంలో ఆనందాన్ని, వారి కళ్లల్లో గర్వాన్ని చూడటమే మన జీవితానికి నిజమైన సార్థకత. మర్చిపోకండి!

   – రైటర్ ఎం.కె

MK News Telugu kaburlu ad

Leave a Reply